Share News

Minister Kondapalli Srinivas: జగనే 9.56 లక్షల పెన్షన్లు తీసేశారు

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:59 AM

అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్‌ తొలగించబోమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Minister Kondapalli Srinivas: జగనే 9.56 లక్షల పెన్షన్లు తీసేశారు

  • అర్హత ఉన్నవారి పింఛన్‌ తొలగించం

  • వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి కొండపల్లి

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్‌ తొలగించబోమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పింఛన్ల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది జూలై నుంచి 65.18 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,700 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. పింఛన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. జగన్‌ హయాంలోనే 9.56 లక్షల పింఛన్లు తొలగించారన్నారు. పింఛన్లు పొందుతున్న వారిలో చనిపోయిన పురుషుల స్థానంలో వారి భార్యలకు వితంతు పెన్షన్‌ మంజూరు చేసినట్టు తెలిపారు. ఇలా 1.10 లక్షల పింఛన్లను ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు మాసాలకు ఒకసారి ‘ఆరు దశల అర్హత’ ప్రక్రియ అంటూ దాదాపు 9.56 లక్షల పింఛన్లను తొలగించిందన్నారు. ఈ విధంగా రద్దు చేసిన వాటిలో దాదాపు 1.03 లక్షల దివ్యాంగ, 14,177 ఆరోగ్య పింఛన్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. అదేసమయంలో తమ వారికి బోగస్‌ పింఛన్లు మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రత్యేకించి దివ్యాంగులు, ఆరోగ్య కేటగిరీల్లో కొంత మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని, కోనసీమ, కడప జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించారని తెలిపారు. వైసీపీ హయాంలో అనర్హులకు బోగస్‌ సర్టిఫికెట్లు జారీచేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ తమ ప్రభుత్వం సర్టిఫికెట్లను పునఃపరిశీలన చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. గత తొమ్మిది నెలల నుంచి ఈ పరిశీలన పారదర్శకంగా జరుగుతోందన్నారు. అనారోగ్యంతో ఉన్న వారి సర్టిఫికెట్లను వారి ఇళ్ల వద్దే వైద్యులు వెరిఫికేషన్‌ చేశారని తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 06:01 AM