చిత్తశుద్ధితో హామీల అమలు: కొలుసు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:38 AM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, దీపం పథకం-2లో ఉచిత గ్యాస్ సిలెండర్లు, తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు సాయం, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు సాయం చేయగా.. మహిళలకు ఏడాదికి రూ.1,942కోట్లు ఖర్చుతో ఉచిత బస్సు పథకాన్ని 15 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా.. పింఛన్ల పెంపు ద్వారా రూ.34 వేల కోట్లు, తల్లికి వందనం ద్వారా రూ.10,500 కోట్లు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయి. పనులు ప్రారంభమయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికి 50 నియోజకవర్గాల్లో ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. ఏపీఐఐసీ దగ్గర 10 వేల ఎకరాలు ఉండగా, మరో 30వేల ఎకరాలు సేకరించి, పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.7,500 కోట్ల రుణ సేకరణకు ఆమోదించింది. రైతులకు ధాన్యం బకాయిలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తున్నాం’ అని వివరించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నాలా చట్ట సవరణ క్యాబినెట్‌లో చర్చకు రాలేదన్నారు.