Kolusu Parthasarathy: జగన్ ఆనందం కోసమే కుట్రపూరిత ఆరోపణలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:56 AM
జగన్ కళ్లల్లో కనిపించే క్రూరమైన ఆనందం కోసం వైసీపీ నాయకులు కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మాజీ మంత్రి జోగి రమేశ్, నకిలీ మద్యం కేసు సూత్రధారి జనార్దనరావు ఉదంతం...
గూగుల్‌ను తెచ్చింది జగనే అని చెప్పుకోవడం సిగ్గుచేటు: మంత్రి కొలుసు
నూజివీడు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘జగన్ కళ్లల్లో కనిపించే క్రూరమైన ఆనందం కోసం వైసీపీ నాయకులు కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మాజీ మంత్రి జోగి రమేశ్, నకిలీ మద్యం కేసు సూత్రధారి జనార్దనరావు ఉదంతం ఒక మచ్చుతునక’ అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. బుధవారం ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘వైసీపీలో పైనుంచి కింది వరకూ క్రిమినల్ మైండ్‌తోనే వ్యవహరిస్తారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై బురద చల్లడానికి జగన్ అండ్ కో కల్తీ మద్యం వంటి వికృత క్రీడకు తెరలేపారు. విశాఖకు గూగుల్ సంస్థను తేవడంలో మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు చేసిన కృషిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఆ సంస్థను జగనే తీసుకువచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైసీపీ పాలనలో వైజాగ్, రాష్ట్రం నుంచి ఎన్ని సంస్థలను తరిమేశారో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. వైసీపీ దుష్ట పన్నాగాలను కూటమి ప్రభుత్వం ఎదుర్కొని తగిన బుద్ధి చెబుతుంది’ అని మంత్రి కొలుసు పేర్కొన్నారు.