Minister Kolusu Parthasarathi: మెరిట్‌కు సీటొస్తే... వైసీపీకెందుకు కడుపు మంట..!
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:14 AM
కొత్త వైద్య కళాశాలల్లో 35 శాతం సీట్లు మాత్రమే రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు దక్కేలా గత వైసీపీ ప్రభుత్వ విధానం ఉంది..
ఓపీ, డయాగ్నోస్టిక్స్, మందులు ఉచితమే
ప్రభుత్వ సంక్షేమంపై 75.1ు సంతృప్తి: మంత్రి కొలుసు
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘కొత్త వైద్య కళాశాలల్లో 35 శాతం సీట్లు మాత్రమే రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు దక్కేలా గత వైసీపీ ప్రభుత్వ విధానం ఉంది. దాన్ని సవరించి కూటమి ప్రభుత్వం 50 శాతం సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కేలా నిర్ణయం తీసుకుంటే వైసీపీకి ఎందుకు కడుపు మంట? అభ్యంతరం ఏమిటి?’ అని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కళాశాలలకు పీపీపీ విధానం అమలుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘పీపీపీ విధానంలో ఆసుపత్రుల్లో 70శాతం బెడ్స్ ఫ్రీగా ఇస్తారు. కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం లేదు. 30ఏళ్ల తర్వాత కళాశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తారు. గత ప్రభుత్వంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్‌ను ప్రైవేటుకు ఎందుకు అప్పగించారు? బోగాపురం, బందర్ పోర్టులను పీపీపీ విధానంలో ఇవ్వలేదా? పేద ప్రజలకు, మెరిట్ విద్యార్థులకు మంచి జరుగుతుంటే వైసీపీకి కడుపుమంటగా ఉంది. పీపీపీతో ఈ కళాశాలల్లో ఓపీ, మందులు, డయాగ్నోస్టిక్ తదితర సేవలన్నీ ఉచితంగా జరుగుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై 75.1 శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని సర్వేలో తేలింది. మిగిలిన 25 శాతం అసంతృప్తికి కారణాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నాం. డ్రోన్ పాలసీ రూపొందించిన తర్వాత రాష్ట్రంలో 2,10,047 గంటలకుపైగా డ్రోన్లను వినియోగించాం’ అని మంత్రి పేర్కొన్నారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భీమవరం డీఎస్సీ తీరుపై నివేదిక కోరడంలో తప్పు లేదని అన్నారు.