Minister Kollu Ravindra: ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:47 AM
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేసి, ఆ కుట్రలో వైసీపీ నేతలే చిక్కుకున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే లిక్కర్ కుట్ర: మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడలో మద్యం షాపు ఆకస్మిక తనిఖీ
కొనుగోలుదారులకు ఎక్సైజ్ సురక్ష యాప్‌పై అవగాహన
విజయవాడ(కలెక్టరేట్), అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేసి, ఆ కుట్రలో వైసీపీ నేతలే చిక్కుకున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ శ్రీధర్‌తో కలిసి విజయవాడలో ఓ మద్యం షాపును మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కొన్ని మద్యం బాటిళ్లను స్కాన్ చేసి, వాటి వివరాలు పరిశీలించారు. తాము కొనుగోలు చేసింది అసలైనదో, కల్తీనో ఈ యాప్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చో కొనుగోలుదారులకు వివరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే పారదర్శకమైన మద్యం పాలసీని తీసుకొచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుట్రలకు తెరలేపారన్నారు. మద్యం కల్తీలో భాగస్వామిగా ఉన్న జనార్దనరావు బయటపెట్టిన వీడియోలో కుట్రకోణం స్పష్టంగా బయటపడిందని తెలిపారు. నెల్లూరులో డీహైడ్రేషన్ కారణంగా, మతిస్థిమితం లేక రోడ్డు పక్కన చనిపోయినవారినీ కల్తీ మద్యం కేసుకు ముడిపెట్టారన్నారు. తాజాగా తిరుపతిలో ఒక వ్యక్తి కళ్లు తిరిగి పడిపోతే చనిపోయాడన్నారని, గుడివాడలో బీరు కొన్న వ్యక్తి గంట తర్వాత వచ్చి గ్యాస్ లేదంటూ హడావిడి చేశారని తెలిపారు. ములకలచెరువులో కల్తీ ఘటన వెలుగులోకి రాగానే ప్రభుత్వం అప్రమత్తమైందని, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. కల్తీ మద్యం కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని, తప్పు చేసినవారు ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరూ లైసెన్సు కలిగిన మద్యం షాపులో మాత్రమే కొనాలని సూచించారు. ఎక్కడైనా అనుమానం కలిగితే తక్షణమే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంలగా ఉన్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మద్యం షాపులో ఎక్సైజ్ సురక్ష యాప్‌పై అవగాహన కల్పించి, ఎక్కువ మందితో డౌన్‌లోడ్ చేయించాలని ఆదేశించారు. బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.