Share News

Minister Kollu Ravindra: ప్రజలు ఛీ కొట్టినా పేర్నికి బుద్ధి రాలేదు

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:46 AM

ప్రజలు ఛీ కొట్టినా పేర్ని నానికి బుద్ధి రాలేదు. పోలీసులపైనే తిరుగుబాటు చేయడం దుర్మార్గం’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Minister Kollu Ravindra: ప్రజలు ఛీ కొట్టినా పేర్నికి బుద్ధి రాలేదు

  • మేము కన్నుకొడితే మా వాళ్లను తట్టుకోగలవా?

  • శవ రాజకీయాలు జగన్‌రెడ్డికి అలవాటైపోయాయి

  • కల్తీ మద్యం కేసులో ఎవరినీ వదలం: మంత్రి కొల్లు

విజయవాడ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ‘ప్రజలు ఛీ కొట్టినా పేర్ని నానికి బుద్ధి రాలేదు. పోలీసులపైనే తిరుగుబాటు చేయడం దుర్మార్గం’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలనే లక్ష్యంతోనే పేర్ని నాని వ్యవహరిస్తున్నాడు. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు పోలీసులపై దాడి చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇష్టానుసారం మాట్లాడితే వదిలిపెట్టేది లేదు. కనుసైగ చేస్తే లేపేయాలని అంటున్న పేర్నీ... మేము కన్న కొడితే మా వాళ్లను నువ్వు తట్టుకోగలవా? మాది ధర్మబద్దంగా నడుచుకునే పార్టీ కాబట్టే సంమయమనం పాటిస్తున్నాం. రాష్ట్రంలో కల్తీ మద్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అన్నమయ్య జిల్లా మొకలకలచెరువులో కల్తీ మద్యం దొరకడం వాస్తవం. ఆ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నాం. 23 మంది నిందితులను గుర్తించాం. 14 మందిని ఇప్పటికే అరెస్టు చేశాం. ప్రధాన సూత్రధారి జనార్దనరావును కూడా గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేశాం. భవానీపురంలో మరో కేసులో 12 మంది నిందితులను గుర్తించి ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నలుగురుకి పీటీ వారెంట్‌ ఇచ్చాం. జయచంద్రారెడ్డి పాత్ర ఉందని తేలడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు అతని కోసం గాలిస్తున్నాం. తెనాలికి చెందిన వైసీపీ బూత్‌ కన్వీనర్‌ ఇదే స్కాంలో ఉంటే ఆ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదో జగన్‌రెడ్డి చెప్పాలి. కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, మల్లాది విష్ణు లాంటి వారు కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు తీశారు. వారిని సస్పెండ్‌ చేయకపోగా పదవులివ్వడమే జగన్‌ నైతికత. కల్తీ మద్యాన్ని ఎవరైనా గుర్తించే విధంగా ఏపీటీఏటీఎస్‌ యాప్‌ రూపొందించాం. బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే బాటిల్‌కు చెందిన సమాచారం తెలుసుకోవచ్చు’ అని మంత్రి కొల్లు పేర్కొన్నారు.


కల్తీ చేస్తే ఎవరినీ వదిలేది లేదు...

‘గత ఐదేళ్లు ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానాన్ని జగన్‌రెడ్డి నాశనం చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్‌ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. అత్యంత పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలుచేసి ప్రజల కోసం పనిచేస్తుంటే... జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాడు. రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మొత్తాన్ని సిండికేట్‌ చేసిన జగన్‌రెడ్డి మద్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు హరించి, జైలుకు వెళ్లి వచ్చినోళ్లు ఇప్పుడు ఏదో జరిగిపోయిందని రాద్ధాంతం చేస్తున్నారు. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ అని చెప్పి జగన్‌రెడ్డి ఆరోపణలు చేయడం కాదు నిరూపించాలి. సాధారణ మరణాలను సైతం మద్యానికి లింక్‌ చేస్తున్నారు. చనిపోయిన ప్రతి కేసులోను ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి పోస్టుమార్టం చేస్తున్నాం. శవ రాజకీయాలు జగన్‌రెడ్డికి అలవాటుగా మారిపోయాయి. ఆయన అరాచకాలు చూసే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరినీ ఉపేక్షించం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి షాపులోను త్వరలోనే మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తాం. అక్రమాలు బయటపడితే షాపు లైసెన్సుని పూర్తిగా రద్దు చేస్తాం’ అని మంత్రి కొల్లు ప్రకటించారు.

Updated Date - Oct 12 , 2025 | 06:47 AM