Share News

Minister Kollu Ravindra: బెల్టు షాపులపై మరింత నిఘా

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:29 AM

బెల్టు షాపులపై నిఘా మరింతగా పెంచి దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా బెల్టు దుకాణాలు కనిపించకూడదని స్పష్టం చేశారు.

Minister Kollu Ravindra: బెల్టు షాపులపై మరింత నిఘా

  • ఎక్సైజ్‌ అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం

  • ఇప్పటి వరకూ 25 జిల్లాలు నాటుసారా రహితం

  • మరో 15 రోజుల్లో కాకినాడ జిల్లా కూడా..

అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): బెల్టు షాపులపై నిఘా మరింతగా పెంచి దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా బెల్టు దుకాణాలు కనిపించకూడదని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మద్యం సీసాలు నిజమైనవేనా అని నిర్ధారించుకునే ఏపీ ఎక్సైజ్‌ సురక్ష యాప్‌ను ఇప్పటివరకూ 1.69లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, యాప్‌ ద్వారా 4,60,415 సీసాలను వినియోగదారులు స్కాన్‌ చేశారని ఆ శాఖ డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ వివరించారు. నకిలీ మద్యంపై అవగాహన పెంచడంలో భాగంగా ప్రతి మద్యం షాపు వద్ద వెయ్యి కరపత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. షాపులు, బార్ల వద్ద యాప్‌ వినియోగంపై పోస్టర్లు అంటించామని చెప్పారు. మద్యం అమ్మే లైసెన్సీలు కూడా స్కాన్‌ చేసిన తర్వాతే అమ్ముతున్నారని పేర్కొన్నారు. నవోదయం 2.0లో భాగంగా ఇప్పటివరకూ 25 జిల్లాలను నాటుసారా రహితంగా ప్రకటించామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ మంత్రికి వివరించారు. మరో 15 రోజుల్లో కాకినాడ జిల్లాను కూడా నాటుసారా రహితంగా మారుస్తామని చెప్పారు. నకిలీ మద్యం నివారణ, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో శాఖ పనితీరు పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే అక్రమాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర సూచించారు.

Updated Date - Nov 01 , 2025 | 04:30 AM