నకిలీ మద్యంతో జోగికి సంబంధాలు: కొల్లు
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:31 AM
మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించే ఓపిక, సమయం లేదా.. జగన్. అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
చోడవరం(అనకాపల్ల్లి), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించే ఓపిక, సమయం లేదా.. జగన్?.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇటువంటి ప్రతిపక్ష నేత ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కేఎ్‌సఎన్‌ఎస్ రాజుతో కలిసి ఆయన పర్యటించారు. కొల్లు మాట్లాడుతూ, ‘‘బెంగళూరు నుంచి విమానంలో తాడేపల్లికి వచ్చిన జగన్.. తుఫాన్ బాధిత రైతులను పరామర్శించలేదు. ఒక ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వం మంచి చేస్తున్నా విమర్శించారు. మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. తుఫాన్ సంభవించిన మరుసటి రోజే క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల కష్టాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబును విమర్శించడం విడ్డూరం. పైగా తుఫాన్ రావడానికి చంద్రబాబే కారణమని ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనం.’’ అని మంత్రి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రతిష్ఠపాలు చేయాలన్న వైసీపీ నేతల ప్రయత్నాలకు నకిలీ మద్యం ఘటన నిదర్శనమని రవీంద్ర ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేశ్‌కు నకిలీమద్యం తయారీదారులతో ఉన్న సంబంధాలు సిట్ విచారణలో బయటపడడంతోనే ఆయనను అరెస్టు చేశారని మంత్రి తెలిపారు.