Minister Durgesh: ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననడం సిగ్గుచేటు
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:13 AM
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు.
జీతాలైతే తీసుకుంటారు.. ప్రజా సమస్యలు మాట్లాడటానికి రారా..!: మంత్రి దుర్గేశ్
తిరుపతి(విద్య), సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని జగన్ చెప్పడం సిగ్గుచేటని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలుగా గెలిచిన వైసీపీ నేతలు ఎందుకు అసెంబ్లీకి రారు? జీతాలైతే తీసుకుంటారా..! ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మాత్రం రారా..! సిగ్గులేకుండా... ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనడం ఏమిటి? జగన్ తోపాటు వైసీపీలో గెలిచినవారెవరూ ప్రజలకు జవాబుదారులుగా ఉండకపోవడం, ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయకపోవడం హేయం’ అని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న మంత్రి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ‘జగన్ అధికారంలోకి వచ్చేదీలేదు... పెట్టుబడిదారులను చేసేది కూడా ఏమీ లేదు’ అని తేల్చేశారు. తిరుపతి, రాయలసీమలో ఆధ్యాత్మిక పర్యాటకంతోపాటు... ఎకో, హెలీ, అడ్వెంచర్ టూరిజంనూ అభివృద్ధి చేస్తామన్నారు. అందుకే విజయవాడ, వైజాగ్ తర్వాత తిరుపతిలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.