Share News

AP High Court: మంత్రి డోలాకు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:38 AM

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో అప్పటి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసిన వ్యవహారంలో సింగరాయకొండ పోలీసులు నమోదు చేసిన కేసు..

AP High Court: మంత్రి డోలాకు హైకోర్టులో ఊరట

  • దిష్టిబొమ్మ దహనం కేసులో తదుపరి చర్యలు నిలుపుదల

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో అప్పటి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసిన వ్యవహారంలో సింగరాయకొండ పోలీసులు నమోదు చేసిన కేసు, దాని ఆధారంగా దిగువ కోర్టులో జరుగుతున్న విచారణపై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలపాటు నిలుపుదల చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఫిర్యాదుదారు, అప్పటి సింగరాయకొండ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసిన వ్యవహారంలో తనపై మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె సుజాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు చార్జ్‌షీట్‌ను కొట్టివేయాలని కోరుతూ మంత్రి డోలా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు ఆధారంగా కందుకూరు అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతున్న విచారణపై తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవన్నారు. కేసును కొట్టివేయాలని కోరారు. ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పోలీసులు ఇప్పటికే చార్జ్‌షీట్‌ దాఖలు చేశారన్నారు. కేసులో మొత్తం 48 మంది నిందితులుగా ఉన్నారన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 05:38 AM