Health Minister Satyakumar urges: వైద్య కళాశాలలపై దుష్ప్రచారం మానుకోండి
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:58 AM
పీపీ విధానంలో పలు వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దుష్ప్రచారాలు మానుకోవాలని వైసీపీ అధ్యక్షుడు..
మీలా అయితే.. 17 కాలేజీల పూర్తికి 23 ఏళ్లు
జగన్‌కు మంత్రి సత్యకుమార్ లేఖ
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పీపీపీ విధానంలో పలు వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దుష్ప్రచారాలు మానుకోవాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హితవు పలికారు. నిరంతరం అబద్ధాలు వల్లెవేయడం వీడి సహేతుకంగా నడుచుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం పట్ల జగన్ వైఖరి కొనసాగితే.. వాటిని పూర్తి చేసి, ప్రతిపాదించిన మేరకు ప్రతి కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున ప్రవేశాలు కల్పించడానికి 23 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పీపీపీ పద్ధతిలో చేపట్టనున్న కళాశాలల నిర్మాణంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ మంత్రి సత్యకుమార్ జగన్‌కు మంత్రి ఆరు పేజీల లేఖ సంధించారు. 17 కొత్త మెడికల్ కాలేజీలకు రూ.8,480 కోట్ల నిర్మాణ వ్యయాన్ని ఆమోదించగా.. జగన్ నాలుగేళ్లలో రూ.1,450 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ విధంగా అన్ని కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి, ప్రవేశాలు కల్పించేందుకు 23 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. ప్రకటించిన దానికి భిన్నంగా ఏడాదికి రూ.363 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.
మర్కాపురం, మదనపల్లి, ఆదోని కాలేజీలపై వివక్ష
2022వరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు పాక్షికంగా ఉన్నప్పటికీ ఎన్‌ఎంసీ మొదటిదశలోని 5 కళాశాలలకు 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున ప్రవేశాలకు అనుమతించిందని మంత్రి వివరించారు. అయితే 2023లో సవరించిన రూల్స్ మేరకు 2024-25 విద్యా సంవత్సరంలో పాడేరు కళాశాలలో 150 సీట్లు ప్రతిపాదించగా, మౌలిక సదుపాయాల లభ్యత ఆధారంగా కేవలం 50సీట్లకు మాత్రమే ఎన్‌ఎంసీ అనుమతించిందని పేర్కొన్నారు. రూ.500 కోట్ల వ్యయ అంచనాతో పులివెందుల కాలేజీ నిర్మాణంచేపట్టి, రూ.412 కోట్ల పనులు పూర్తి చేసిన మాజీ సీఎం..మర్కాపురం, మదనపల్లి, ఆదోని కాలేజీల పట్ల వివక్ష చూపారని, రూ.126 కోట్ల పనులతో సరిపెట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే పీపీపీ కళాశాలలను రద్దు చేస్తానని జగన్ హెచ్చరికలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.