Minister Atchannaidu: రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:25 AM
రైతుల్ని ప్రతిసారి తప్పుదారి పట్టించే పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మరోసారి అబద్దాలను ప్రచారం చేయడం దారుణమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అన్నదాతలను తప్పుదారి పట్టిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే: అచ్చెన్న
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రైతుల్ని ప్రతిసారి తప్పుదారి పట్టించే పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మరోసారి అబద్దాలను ప్రచారం చేయడం దారుణమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల్ని పట్టించుకోవట్లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘ఏడాదిన్నర కూటమి పాలనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదంటున్న జగన్.. నీ ఐదేళ్ల పాలనలో రైతుల్ని ఏం ఉద్ధరించావ్? మా 18 నెలల కాలంలో మేమేం చేశామో బహిరంగ చర్చకు రా’ అని సవాల్ విసిరారు. జగన్‌రెడ్డి అనే పిల్లి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వారానికోసారి బయటకు వచ్చి విలేకరుల సమావేశం పెట్టిమరీ పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటాడని ఆయన మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. ఇంట్లో టీవీ ముందు కూర్చుని తన పేపరు, తన టీవీల్లో మాట్లాడడం కాదని, దమ్ముంటే శాసనసభకు రావాలని జగన్‌కు అచ్చెన్న సవాల్ విసిరారు. ‘జగన్ పాలనలో రైతులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. వ్యవసాయ ఆధారిత రంగాలను ఆదర్శంగా నిలపేలా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే.. పంట ఉత్పత్తుల ధరలు పతనమయ్యాయంటూ జగన్ విమర్శలు చేయడం హాస్యాస్పదం. 2023లో అధిక వర్షాలకు రైతులు నష్టపోతే జొన్న, మొక్కజొన్నకు ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు రూ.5కోట్లు విడుదల చేయకుండా ఎగ్గొట్టిన జగన్‌కు 18నెలల కాలంలో 16 విపత్తులు వస్తే.. ఒక్కసారైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని అడిగే నైతిక హక్కు ఎక్కడది? రైతుల్ని మోసం చేసిందెవరో జగన్ ప్రెస్‌మీట్‌తోనే తేలిపోయింది. గోబెల్స్ ప్రచారం ఎవరిదో రైతులకు అర్ధమైంది. కూటమి సర్కార్‌పై ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని చూడలేక ఇంకా తప్పుడు కూతలు కూస్తున్న జగన్‌కు మళ్లీ ప్రజలే బుద్ధి చెప్తారు’’ అని హెచ్చరించారు. జగన్ రెడ్డిలా తాము బెంగళూరు, తాడేపల్లి ప్యాలె్‌సలలో కూర్చోవడం లేదని, గత ఆరు రోజులుగా రాష్ట్రంలో 55లక్షల మంది రైతులను కలిసి మాట్లాడామని అచ్చెన్న తెలిపారు.