మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు: మంత్రి అనిత
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:18 AM
యువత మత్తు పదార్థాల జోలికి పోకుండా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.
‘అభ్యుదయం’ సైకిల్ ర్యాలీని ప్రారంభించిన వంగలపూడి
పాయకరావుపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాల జోలికి పోకుండా భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీస్ శాఖ తలపెట్టిన ‘అభ్యుదయం’ సైకిల్ ర్యాలీని బుధవారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రాంభించారు. ‘కూటమి ప్రభుత్వం యువతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. గంజాయిపై ఉక్కుపాదం మోపింది’ అని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 25 రోజులపాటు, సుమారు 500 కిలోమీటర్ల మేర అభ్యదయం సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. అనితతోపాటు డీఐజీ, ఎస్పీ సైకిల్ తొక్కుతూ పట్టణ శివారు వరకు వెళ్లారు.