Minister Anita: తప్పుడు ప్రచారంతో భయపెట్టొద్దు
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:01 AM
తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేలా సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలు చేయవద్దని...
మొంథా తుఫాన్‌పై థంబ్ నెయిల్స్ భయ పెట్టేలా ఉన్నాయి: మంత్రి అనిత
సోషల్ మీడియా సంయమనం పాటించాలని సూచన
యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడి
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేలా సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలు చేయవద్దని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కోరారు. సంచలన శీర్షికలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడం బాధ్యతా రాహిత్యమేనని తెలిపారు. సహాయక చర్యలకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైందన్నారు. అయితే.. సోషల్ మీడియాలో పాత ఫోటోలు, వీడియోలు భయపెట్టేలా థంబ్ నెయిల్స్‌ను పెట్టి నకిలీ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పదేళ్ల క్రితం విశాఖలో వచ్చిన హుద్‌హుద్ తుఫాను మాదిరిగా.. ప్రస్తుత మొంథా తుఫాను కూడా ఉంటుందనే భయంతో ప్రజలు భీతిల్లుతున్నారని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయమై అధికార వర్గాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిందని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి కలెక్టర్లు, ఎస్పీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సంయమనం పాటించాలని సూచించారు. దురుద్దేశ పూర్వకంగా నకిలీ ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
పునరావాస కేంద్రాలకు ప్రజలు: అనిత, అనగాని
‘తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పిల్లలు, పెద్దలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థానాలకు తరలించాం’ అని మంత్రులు అనిత, అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ‘పునరావాస కేంద్రాల్లో ప్రజలకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీజీఎ్‌సలో సీఎం చంద్రబాబు, లోకేశ్ ఉదయం నుంచి కూర్చుని అధికారుల అప్రమత్తతపై సూచనలు చేస్తున్నారు. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.