Minister Anita: మంత్రుల మధ్య ఇగో ఫీలింగ్స్ లేవు
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:48 AM
రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి నేతల మధ్య మంచి అవగాహన, సమన్వయం ఉన్నాయని, అధికారులు...
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే లక్ష్మయ్యనాయుడు హత్య: అనిత
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి నేతల మధ్య మంచి అవగాహన, సమన్వయం ఉన్నాయని, అధికారులు కలిసిమెలసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా దారకానిపాడులో లక్ష్మయ్యనాయుడు హత్యకు కులాలతో సంబంధం లేదని, ఆర్థిక వ్యవహారాల కారణంగానే జరిగినట్లు మృతుడి భార్యే చెప్పారని వివరించారు. ఈ విషయంలో కులాలను రెచ్చగొడితే ఉపేక్షించబోమని వ్యాఖ్యానించారు. గతంలో హోంశాఖ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... ఇప్పుడు భీమవరం డీఎస్పీపై డీజీపీని నివేదిక కోరడంపై ఓ విలేకరి ప్రశ్నించగా... ‘పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం. ఆయన సూచనలు ఇవ్వడంలో తప్పేముంది..? ప్రతిదీ భూతద్ధంలో చూడకండి. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు..? మాకు లేని ఇగో మీకెందుకు..? డీఎస్పీ విషయం మా నోటీస్‌లో ఉంది. నాకూ రిపోర్టులు వచ్చాయి. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. రాజ్యాంగపరంగా డిప్యూటీ సీఎం డీజీపీని నివేదిక కోరవచ్చా..? అని ప్రశ్నించగా.. ‘మేమంతా ఒక్కటే. అయినా ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వంలో జగన్‌ను అడిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఎన్డీయే ప్రభుత్వంలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకూ మాకూ అవగాహన, సమన్వయం ఉన్నాయి. ఎటువంటి ఇగోలు లేకుండా పనిచేస్తున్నాం. మా అధికారులూ కలిసి పనిచేస్తున్నారు. మేమంతా కలిసి పని చేసుకుంటున్నప్పుడు ఈ ప్రశ్న అవసరం లేదని మా అభిప్రాయం’ అని అనిత బదులిచ్చారు.