YSRCP Conspiracies: వైసీపీ కుట్రలను భగ్నం చేద్దాం
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:35 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం...
రాష్ట్ర తెలుగు మహిళ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి అనిత
పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం’ అని అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలుగు మహిళ విస్తృతస్థాయి సమావేశం జరిగిం ది. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ, ‘వైసీపీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా కుట్రలు పన్నుతోంది. కుట్ర లు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ కుట్రలను భగ్నం చేయడంతోపాటు కూటమి చేస్తున్న మంచిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు.
సమావేశంలో వైసీపీ కుట్ర రాజకీయాలు, మహిళలను ఆ పార్టీ అధినేత, ఇతర నేతలు అవమానిస్తున్న తీరుపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ... ‘గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తే నా వ్యక్తిత్వాన్ని కించపరిచే లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎదురుదాడి చేస్తున్నారు. ప్రసన్నకు నేను చెల్లెలి వరుస అవుతాను. అయినా కూడా సభ్యసమాజం సిగ్గుపడేలా మురికి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నాయకులను జగన్ వెనకేసుకొస్తున్నారంటే ఆయన ఆలోచన తీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న వ్యాఖ్యలపై త్వరలో రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తాం’ అని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వారి విషయంలో కఠినంగా ఉండాలి. అలాంటి వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది సత్యం.’అని స్పష్టం చేశారు.