Anam Ramanarayana Reddy: జగన్‌రెడ్డి కళ్లకు కనిపించని సంక్షేమం
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:57 AM
గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని సంక్షేమాన్ని నేడు ప్రజలు ఆనందంగా అందుకుంటున్నారు. అయితే జగన్‌రెడ్డి కళ్లకు మాత్రం ఈ సంక్షేమం కనిపించడం లేదు. సంక్షేమం గురించి గంటల తరబడి మాట్లాడటం వేరు, చేసి చూపడం వేరు.
రాజకీయాలకు ఆయన అనర్హుడు: మంత్రి ఆనం
ఆత్మకూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘గతంలో ఏ ప్రభుత్వాలూ ఇవ్వని సంక్షేమాన్ని నేడు ప్రజలు ఆనందంగా అందుకుంటున్నారు. అయితే జగన్‌రెడ్డి కళ్లకు మాత్రం ఈ సంక్షేమం కనిపించడం లేదు. సంక్షేమం గురించి గంటల తరబడి మాట్లాడటం వేరు, చేసి చూపడం వేరు. నేడు కూటమి ప్రభుత్వంలో అదే సంక్షేమం కొత్త చరిత్రను తిరగ రాస్తోంది’ అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల సీఎం చంద్రబాబుపై నీచమైన వ్యాఖ్యలు చేసిన జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని అనైతిక నీచస్థాయి రాజకీయాలు నేడు రాష్ట్రంలో వైసీపీ ద్వారా, జగన్ ద్వారా చూస్తుండడం చాలా విచారకరం. వైసీపీలో కీలక నేతలంతా పార్టీని వీడుతుండటం, అక్రమాలు వెలుగు చూస్తుండడంతో జగన్ తీవ్ర ఫ్రస్ర్టేషన్‌లో ఉండి నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారు. అరాచకం, రౌడీయిజం, ఎదురుదాడితో రాజకీయం చేయాలనుకోవడం మంచిది కాదు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్‌రాయళ్ల ఇంటికెళ్లి పరామర్శించడం, ఏదో ఘనత సాధించినట్లు విజయయాత్ర చేయడం గతంలో ఎప్పుడూ నా రాజకీయ జీవితంలో చూడలేదు. జగన్‌రెడ్డి రాజకీయాలకు అనర్హుడు’ అని అన్నారు.