Minister Anam: టీటీడీలో అన్యమత ఉద్యోగులు నిజమే
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:49 AM
టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నది వాస్తవమేని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో...
ఎంతమంది ఉన్నారో నివేదిక కోరాం.. సర్వీసు రూల్స్ ప్రకారం బదిలీపై నిర్ణయం
ఆగస్టులో 1,014 దేవాలయాలకు పాలకవర్గాలు: దేవదాయ మంత్రి ఆనం
ఎంతమంది ఉన్నారో టీటీడీని నివేదిక కోరాం
తిరుమలలో వివిధ అంశాలపై సమన్వయ సమావేశం
599 మంది వేద పండితులకు సంభావనపైనా చర్చ
తిరుమల, జూలై 12(ఆంధ్రజ్యోతి): టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నది వాస్తవమేని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో టీటీడీ కాలేజీలు, స్కూళ్లు, పరిపాలన విభాగాల్లో హిందూయేతరులను ఉద్యోగులుగా నియమించారని చెప్పారు. వీరు ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరామని తెలిపారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను దృష్టిలో పెట్టుకుని, న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటాయా అనే విషయం క్షుణ్నంగా తెలుసుకున్న తర్వాతే వారిని ఏ విభాగాలకు బదిలీ చేయాలో త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. టీటీడీ నుంచి దేవదాయ శాఖకు ఎంత సీజీఎఫ్ రావాలనే అంశంపై సమావేశంలో చర్చించామని, సీఎంతో మరోమారు చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 599మంది నిరుద్యోగ వేదపండితులకు రూ.3వేల చొప్పున సంభావన ఇచ్చే అంశంపై కూడా చర్చించామని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే మార్గం పక్కనే ఉన్న 2.10 ఎకరాల భూమిని అమ్మవారి ఆలయానికి లీజుకు ఇవ్వాలని కోరగా, టీటీడీ సానుకూలంగా స్పందించిందని చెప్పారు.
ఈ స్థలం అందుబాటులోకి వస్తే బహుళ అంతస్థుల కార్ పార్కింగ్, వసతి సముదాయాలతో పాటు మరో నూతన రోడ్డు భక్తులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతో ఒక మార్గంలో భక్తులు పైకి వెళితే మరో మార్గంలో కిందకు వస్తారని వివరించారు. దేవదాయ శాఖ పరిధిలో రూ.5లక్షలకు పైబడి, రూ.25లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలు మొత్తం 1,014 ఉన్నాయని, వీటికి ఆగస్టులో నూతన పాలకవర్గాలను నియమిస్తామని వెల్లడించారు. అలాగే రూ.25లక్షల నుంచి రూ.5కోట్ల పైబడి ఆదాయం ఉన్న 500 ఆలయాలకూ రెండు, మూడు నెలల్లోనే పాలకవర్గాలను నియమిస్తామని మంత్రి చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆలయాల నిర్మాణాలకు రూ.147 కోట్లు విడుదల కాక నిలిచిపోయాయని, ఖర్చుల వివరాలు అందగానే ఆ నిధులు విడుదల చేస్తామని టీటీడీ తెలిపిందని ఆనం పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, దేవదాయ శాఖ కార్యదర్శి వినయ్‌చంద్ పాల్గొన్నారు.