Minister Achenna Naidu: పీఎం కిసాన్‌తోపాటే అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:26 AM
మే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ, మధ్యలో ఒకసారి పీఎం కిసాన్ కింద రైతులకు సాయాన్ని అందిస్తుంది.

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ, మధ్యలో ఒకసారి పీఎం కిసాన్ కింద రైతులకు సాయాన్ని అందిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ కింద ఇచ్చే సాయాన్ని కూడా అందించాలని నిర్ణయించాం’ అని మంత్రి వివరించారు. మంగళవారం శాసనమండలిలో వ్యవసాయ రంగంలో సంక్షోభం అనే అంశంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ‘అన్నదాత సుఖీభవ మూడు విడతలుగా ఇస్తామంటున్నారని.. ప్రభుత్వానికి ఇది మంచిదికాదని ఒకేసారి సాయం అందించాలి’ అని కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ‘కేంద్రం ఖరీఫ్, రబీ, మధ్యలో ఒకసారి మూడు విడతలుగా సాయం ఇస్తోంది. వాళ్లు ఎప్పుడిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు అప్పుడే ఇవ్వడానికి నిర్ణయించాం’ అని చెప్పారు.
గత ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ.7,500 ఇచ్చి, మిగతా పథకాలన్నీ ఆపేసిందని మంత్రి విమర్శించారు. రుణమాఫీకి 2016లో బాండ్లు ఇచ్చారని 2019 వరకు డబ్బులు ఇవ్వకుండా ఏంచేశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మిర్చి ఒక్క టన్నైనా రూ.11,700కి కొన్నారా? అని ప్రశ్నించారు. రైతాంగానికి గిట్టుబాటు ధర పెద్ద సమస్యగా మారిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పత్తిని సీసీఐ యార్డుల్లో కాకుండా జిన్నింగ్ మిల్లుల్లో కొంటున్నారన్నారు. పండించిన ధాన్యంలో 40 శాతం మాత్రమే కొనుగోలు చేశారని మిగిలిన 60శాతం రైతుల వద్దే ఉందన్నారు.