Share News

TDP Ministers: పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేసిన మీరా మాట్లాడేది

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:34 AM

సూపర్‌ సిక్స్‌ హామీల అమలు సూపర్‌ హిట్‌ అయిందని మంత్రులు పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలిలో సూపర్‌ సిక్స్‌ హామీలపై జరిగిన లఘు చర్చలో పలువురు మాట్లాడారు.

TDP Ministers: పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేసిన మీరా మాట్లాడేది

  • వైసీపీపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్‌

  • ఇబ్బందులు ఉన్నా హామీలను నెరవేర్చామని వెల్లడి

  • సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌: మండలిలో మంత్రులు

అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ హామీల అమలు సూపర్‌ హిట్‌ అయిందని మంత్రులు పేర్కొన్నారు. శుక్రవారం శాసనమండలిలో సూపర్‌ సిక్స్‌ హామీలపై జరిగిన లఘు చర్చలో పలువురు మాట్లాడారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేసిన వైసీ పీ.. కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయతకు కూటమి ప్రభుత్వం ప్రతిరూపమని.. అదే వైసీపీ అసలు రూపం ద్రోహం, అవినీతి, అహంకారమని విమర్శించారు. మీ తాత లేదా మీ తండ్రి లేదా మీ పేరు పెట్టుకుని అయినా అన్న క్యాంటీన్లను నడపాలని అప్పటి సీఎం జగన్‌ను సభలో కోరినా.. పట్టించుకోకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూట మి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చిందని పేర్కొన్నారు. వైసీపీ తమ మ్యానిఫెస్టో గురించి మాట్లాడ డం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మ్యానిఫెస్టోను అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అన్నదాత సుఖీభవతో 47 లక్షల మంది రైతులకు తొలి విడత ఆర్థిక సాయం అందజేశామని, 3 లక్షల మంది కౌలు రైతులకూ రెండవ విడతలో సాయం అందజేయబోతున్నామన్నారు.

రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్‌ పార్కులు: భరత్‌

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ అయిందని పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. తమ ప్ర భుత్వం వచ్చిన 15 నెల ల్లో 5.50 లక్షల ఉద్యోగా లు కల్పించామని, ఐదేళ్లు అయ్యే నాటికి 20 లక్షల ఉద్యోగాలు కచ్చితంగా ఇస్తామని చెప్పారు 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, 50 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు అయ్యాయని, 121 పార్కులను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


రోజూ లక్షల మందికి ఉచిత బస్సు

రాష్ట్రంలో రోజూ 22 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 40 శాతంగా ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య 62 శాతానికి పెరిగిందన్నారు. రోజుకు మహిళా ప్రయాణికుల సంఖ్య 9.4 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగిందన్నారు. కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. వీటిలో ఏపీ ఆక్వాకల్చర్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ సవరణ బిల్లుతో పాటు పురపాలక శాఖకు చెందిన బిల్లులున్నాయి.

దీపం లబ్ధిదారుల ఖాతాల్లో 1,720 కోట్లు జమ: నాదెండ్ల

రాష్ట్రంలో 1.42 లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు కోటి 4 లక్షల కుటుంబాలకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,720 కోట్లు జమ చేశామన్నారు. సూపర్‌ సిక్స్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత సిలిండర్‌ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

ఆడబిడ్డ నిధి హామీ అమలుకు ప్రయత్నం: కొండపల్లి

రాష్ట్రంలోని 18-59 సంవత్సరాల మధ్య మహిళలకు ఆడబిడ్డ నిధి హమీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ పథకాన్ని కచ్చితంగా అమలు చేసేలా భవిష్యత్తులో విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన మహిళ లందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు.


  • మావి సూపర్‌డూపర్‌ పథకాలు

  • పులివెందుల’లో మా గెలుపే కూటమిపై ప్రజల్లోని సంతృప్తికి నిదర్శనం: అచ్చెన్న

సూపర్‌సిక్స్‌ పథకాలపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, విపక్షనేత బొత్స సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం సాగింది. ఆడబిడ్డ పథకం అమలు కావాలంటే ఏపీని అమ్మాలని మం త్రి అచ్చెన్నాయుడు గతంలో అన్నారని వైసీపీ సభ్యు డు ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించడం మండలిలో గందరగోళానికి దారితీసింది. దీనిపై మంత్రి అచ్చెన్న తీవ్రంగా స్పందించారు. ‘‘గత వైసీపీ పాలనలో ఏపీలో ఏమైనా మిగిల్చారా? ఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. రూ.9 లక్షల కోట్ల మేర అప్పులుచేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల్లో రూ.కోట్ల బకాయిలు పెట్టారు. వాటన్నింటినీ ఎప్పటికి తీర్చాలి? ఈ విషయంలో మాట్లాడటానికి వైసీపీ వాళ్లకు సిగ్గుండాలి. ఐదేళ్లలో ఒక్కపరిశ్రమ కూడా తేలేదు. డీఎస్సీ ఇవ్వలేదు. అలాంటిది మాకు శ్రీరంగనీతులు చెబుతారా? సూపర్‌సిక్స్‌ అమలు చేసినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి, ఇంకా మాట్లాడతారా? ప్రజలు జగన్‌ను, వైసీపీని ఛీ కొట్టినా ఇంకా బుద్ధిరాలేదు’’ అంటూ ఆగ్రహించారు. దీనిపై విపక్షనేత బొత్స జోక్యం చేసుకుంటూ, సభ్యులు మాట్లాడుతుంటే మంత్రి ఎలా అడ్డుపడతారని ప్రశ్నించారు. తన పేరు ప్రస్తావించినందుకే మాట్లాడాల్సి వచ్చిందని అచ్చెన్న అనగా.. ఎందుకు సహనం కోల్పోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. సూపర్‌సిక్స్‌ సూపర్‌హిట్‌ కాదు..సూపర్‌డూపర్‌ అని ఈ సందర్బంగా అచ్చెన్న అన్నారు. వైసీపీకి రెండు జడ్పీటీసీ స్థానాల్లో డిపాజిట్‌ రాకపోవడమే సూపర్‌సిక్స్‌పై ప్రజలు సంతృప్తికి నిదర్శనమన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 04:36 AM