Share News

Minister Achennaidu criticized YSRCP: రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలి

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:52 AM

రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన చేశారు...

Minister Achennaidu criticized YSRCP: రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలి

  • 2022-23 రబీ నుంచి బీమా కంపెనీలకు చెల్లింపులు చేయని జగన్‌: మంత్రి అచ్చెన్న

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రైతుల పేరుతో వైసీపీ నేతలు నాటకాలు ఆపాలని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన చేశారు. ‘అవినాశ్‌రెడ్డి ఇన్నాళ్లూ కళ్లకు గంతలు కట్టుకున్నారు. రాయలసీమలో ఏం జరుగుతుందో కూడా చూడలేదు. ఇప్పుడు ఉల్లి రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారు. ఉల్లికి హెక్టారుకు రూ.50 వేలు ప్రకటించి, రూ.105 కోట్లు రైతులకు సీఎం చంద్రబాబు లబ్ధి చేకూర్చారు. ఉల్లి ధర తగ్గుతుంటే క్వింటా రూ.1,200కు కర్నూలు యార్డులో రూ.17.22 కోట్లతో కొనుగోలు చేశాం. జగన్‌ పాలనలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 టన్నుల ఉల్లిని సేకరించి, రూ.75 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. 2020లో ఉల్లి ధర పడిపోతే మద్దతు ధర రూ.770 ప్రకటించడం తప్ప... కిలో కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడేమో వైసీపీ నేతలు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని మంత్రి అచ్చెన్న విమర్శించారు. మరో ప్రకటనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జగన్‌ నోరు తెరిస్తే.. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘జగన్‌ గొప్పగా చెప్పే ఉచిత పంటల బీమా ఆయన పాలనలోనే పూర్తిగా విఫలమైంది. 2019 తర్వాత ఏ రబీ సీజన్‌లోనూ రైతులకు అమలు చేయలేదు. 2020, 2021 ఖరీఫ్‌ సీజన్లలో మాత్రమే బీమా అమలు చేసినా... పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే ఇచ్చారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రీమియం సబ్సిడీ పొందేందుకు ఫసల్‌ బీమా అమలు చేస్తామని ప్రకటించారు. రైతు వాటా, రాష్ట్ర వాటా తామే చెల్లిస్తామని హామీ ఇచ్చిన జగన్‌... మోసం చేశారు. 2018-19 రబీ క్లెయిమ్‌లను 2020లో పరిష్కరించారు. 2022-23 రబీ నుంచి సబ్సిడీని బీమా కంపెనీలకు ఇంకా చెల్లించలేదు’ అని మంత్రి వాపోయారు.

Updated Date - Nov 05 , 2025 | 04:52 AM