Share News

Minister Acchennaidu: సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:57 AM

రాష్ట్రంలో సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మక్కెన...

Minister Acchennaidu: సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం

  • వీలైనంత త్వరగా ఎన్నికలు: అచ్చెన్న

గుంటూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సహకార వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అచ్చెన్నతోపాటు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు తదితరులు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకుల్లో రూ.కోట్లు లూటీ చేశారని మండిపడ్డారు. అక్రమంగా రుణాలు, కుంభకోణాలపై విచారణ జరిపి ఎంతటి వారినైనా వదిలేదిలేదన్నారు. అర్హులైన వారికి మాత్రమే సొసైటీల్లో సభ్యత్వాలుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దఫా కౌలు రైతులకు కూడా రుణాలు అందించేలా పక్కాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో ఎన్నికలు జరిపి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రాథమిక పరమితి సంఘాలు, సెంట్రల్‌ బ్యాంకులను కంప్యూటరీకరణ చేశామని, ఈ నెల నుంచి ఆన్‌లైన్‌లోనే అన్ని లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు వేస్తామన్నారు. నల్లబర్లీ పొగాకు కొనుగోళ్లకు సంబంధించి సీఎం చంద్రబాబు దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని, గత ఏడాది కంటే మూడు రెట్లు ఉత్పత్తి పెరిగిందన్నారు. వీలైతే మార్క్‌ఫెడ్‌నూ రంగంలోకి దించి కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jun 06 , 2025 | 04:58 AM