Share News

మైనింగ్‌ ‘వార్‌’!

ABN , Publish Date - Dec 01 , 2025 | 01:12 AM

ఇబ్రహీంపట్నం, జి.కొండూరు క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌, జిల్లా మైనింగ్‌ అధికారి మధ్య వివాదం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమరావతి ప్రాజెక్టుకు రోడ్డు మెటల్‌ను అడ్డుకుంటున్న జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవాలని క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని ఇన్ర్ఫాటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, 15 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని మైనింగ్‌ అధికారి నుంచి నోటీసు జారీ అయ్యింది.

మైనింగ్‌ ‘వార్‌’!

- క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌, జిల్లా మైనింగ్‌ అధికారి మధ్య వివాదం

- జిల్లా మైనింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోండి

- అమరావతి ప్రాజెక్టులకు రోడ్డు మెటల్‌ను అడ్డుకుంటున్నారు

- రెన్యువల్స్‌ చేయకపోవటం వల్ల క్రషర్స్‌ మూతపడుతున్నాయి

- సీఎం చంద్రబాబుకు ఇబ్రహీంపట్నం, జీ కొండూరు క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు

- క్రషర్స్‌ అసోసియేషన్‌ కీలక నేతకు జిల్లా మైనింగ్‌ అధికారి షోకాజ్‌ నోటీసు

- అక్రమంగా మైనింగ్‌ , రవాణా, నిల్వ, తనిఖీల్లో గుర్తించిన అంశాలను వివరిస్తూ..

- 15 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

ఇబ్రహీంపట్నం, జి.కొండూరు క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌, జిల్లా మైనింగ్‌ అధికారి మధ్య వివాదం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమరావతి ప్రాజెక్టుకు రోడ్డు మెటల్‌ను అడ్డుకుంటున్న జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవాలని క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని ఇన్ర్ఫాటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, 15 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని మైనింగ్‌ అధికారి నుంచి నోటీసు జారీ అయ్యింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఎన్టీఆర్‌ జిల్లా మైనింగ్‌ అధికారి శ్రీనివాస్‌పై ఇబ్రహీంపట్నం, జి.కొండూరు క్వారీ క్రషర్స్‌ అసోసియేషన్‌ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఒక అధికారిపై క్రషర్స్‌ అసోసియేషన్‌ లేఖ రాయటం ఇదే మొదటిసారి. రాజధాని అమరావతిలో భారీ ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టుల పనులకు మెటల్‌ను అందిస్తున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు రోడ్‌ మెటల్‌ను సరఫరా చేయటం కోసం ఉచిత పర్మిట్లను కేటాయించటానికి మెమోను గనుల శాఖ జారీ చేసినా.. జిల్లా అధికారి అమలు చేయటం లేదని క్రషర్స్‌ అసోసియేషన్‌ తమ ఫిర్యాదులో పేర్కొంది. రెన్యువల్స్‌, పర్మిట్లతో పాటు ఇతర ముఖ్యమైన ఫైళ్లను పరిష్కరించే విషయంలో తీవ్ర జాప్యం చేయటం వల్ల క్రషర్స్‌ యూనిట్ల కార్యకలాపాలను బలవంతంగా నిలిపివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. మైనింగ్‌ అధికారిపై శాఖాపరమైన విజిలెన్స్‌ విచారణ జరిపించాలని అభ్యర్థించింది.

అసోసియేషన్‌ నేతకు జిల్లా అధికారి షోకాజ్‌ నోటీసు :

క్రషర్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు నేపథ్యంలో అసోసియేషన్‌ కీలక నేత పెమ్మసాని శ్రీధర్‌కు జిల్లా మైనింగ్‌ అధికారి శ్రీనివాస్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. జి.కొండూరు మండలం లోయ గ్రామంలోని రీ సర్వే నెంబర్‌ 49/1లోని పెమ్మసాని ఇన్ర్ఫాటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీనరేజ్‌ ఫీజును తప్పించుకోవటంతో పాటు ఆ సంస్థపై వచ్చిన అనేక ఫిర్యాదులపై షోకాజు నోటీసును జారీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కార్యాలయ తనిఖీ నివేదికలతో పాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదులను అందులో కోట్‌ చేశారు. అక్రమ క్వారీ కార్యకలాపాలను గుర్తించటం జరిగిందని, సర్వే నెంబర్‌ 26/2లో 8.418 హెక్టార్ల ఎల్‌ఆర్‌ వర్మ క్వారీ లీజు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయని నోటీసులో తెలిపారు. సర్వే నెంబర్‌ 49/1లో స్టోన్‌ క్రషింగ్‌, రోడ్డు మెటల్‌ స్టాక్‌ చేయటం, రవాణా వ్యవహారాలలో ఉల్లంఘనలను గుర్తించామని పేర్కొన్నారు. ఇదే సర్వే నెంబర్‌లో రెండు స్టోన్‌ క్రషర్స్‌ పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. తనిఖీల సమయంలో మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌, జీఎస్టీ రిజిస్ర్టేషన్స్‌ చూపమని అడిగినపుడు సిబ్బంది తెలియదని చెప్పారని, అలాగే తాము గుర్తించిన స్టాక్‌ వివరాలను కూడా నోటీసులో పొందుపరిచారు. అక్రమంగా నిల్వలకు పాల్పడిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. చట్టబద్ధమైన అంగీకారం లేకుండా ఖనిజాన్ని తీయటం, రవాణా చేయటం, నిల్వ చేయటం ఏపీఎంఎంసీ చట్టం నియమం 26(1)(సీ) కిందకు వస్తుందని స్పష్టం చేశారు. నోటీసు ఇచ్చిన 15 రోజుల్లో వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated Date - Dec 01 , 2025 | 01:12 AM