Share News

Revenue Department: గనుల ఆదాయానికి గండి

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:03 AM

రెవెన్యూ పోరంబోకు భూముల పరిధిలో ఉన్న కొండలు, గుట్టలను మైనింగ్‌ లీజుల రూపంలో ప్రభుత్వం కేటాయిస్తుంటుంది. దీని వల్ల ఏటా వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుంది. మైనింగ్‌ లీజులను రెవెన్యూశాఖ నిర్దేశించిన ప్రభుత్వ పోరంబోకు భూముల్లోనే కేటాయిస్తారు. దీనికోసం రెవెన్యూ శాఖ నుంచి గనుల శాఖ ఆమోదం తీసుకుంటుంది.

Revenue Department: గనుల ఆదాయానికి గండి

  • రెవెన్యూ నిర్లక్ష్యంతో మైనింగ్‌ లీజులకు బ్రేక్‌

  • రెవెన్యూ పోరంబోకు పేరిట లీజులు

  • అవి తమ భూములంటున్న అటవీ శాఖ

  • రికార్డుచూసి నిజమేదో తేలిస్తే సత్వర పరిష్కారం

  • సెటిల్‌ చేయకుండా చోద్యం చూస్తున్న రెవెన్యూ

  • నిలిచిపోయిన వంద మైనింగ్‌ లీజులు

ప్రభుత్వానికి మైనింగ్‌ లీజులు రూ.వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. రెవెన్యూ పోరంబోకు భూములనే లీజులకు ఇస్తారు. ఈ ప్రక్రియలో రెవెన్యూశాఖది కీలక పాత్ర. ఆ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాతే లీజు ప్రక్రియను గనులశాఖ ప్రారంభిస్తుంది. అయితే, కొన్నిరకాల భూములపై అటవీశాఖ అభ్యంతరాలు చెబుతుండటం, దానిపై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వల్ల వచ్చే రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. ఇలా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం తెచ్చిపెట్టే 100 మైనింగ్‌ లీజులు నిలిచిపోయాయి. దీంతో రెవెన్యూ శాఖ తీరు మారదంటే మారదు అనే వ్యాఖ్య ఆ శాఖ వర్గాల్లోనే వినిపిస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెవెన్యూ పోరంబోకు భూముల పరిధిలో ఉన్న కొండలు, గుట్టలను మైనింగ్‌ లీజుల రూపంలో ప్రభుత్వం కేటాయిస్తుంటుంది. దీని వల్ల ఏటా వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుంది. మైనింగ్‌ లీజులను రెవెన్యూశాఖ నిర్దేశించిన ప్రభుత్వ పోరంబోకు భూముల్లోనే కేటాయిస్తారు. దీనికోసం రెవెన్యూ శాఖ నుంచి గనుల శాఖ ఆమోదం తీసుకుంటుంది. ఆ తర్వాత పర్యావరణ అనుమతులు పొందాలి. అయితే తీరా లీజులు ఇచ్చిన తర్వాత కొన్ని రకాల భూములపై అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. అది రిజర్వ్‌ చేయని (అన్‌ రిజర్వ్డ్‌) అటవీ ప్రాంతమని, అక్కడ మైనింగ్‌ చేయడానికి వీలు లేదంటూ అటవీ విభాగం నోటీసులు ఇస్తోంది. నిజానికి ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 100 లీజులున్నాయి. వీటిని పరిష్కరించాల్సింది రెవెన్యూశాఖనే. ఇవి సత్వరమే సెటిల్‌ అయ్యేలా రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకోవాల్సింది గనుల శాఖ. కానీ ఆ రెండు విభాగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా గత దశాబ్దన్నర కాలంగా ఆ లీజుల నుంచి వచ్చే రూ.వందల కోట్ల ఆదాయం నిలిచిపోయింది. దీనికి ప్రధాన బాధ్యత రెవెన్యూదే అని ఆ శాఖవర్గాలే చెబుతున్నాయి.


రికార్డుల్లో ఉన్నా..

ఉమ్మడి కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం కడిమిపోతవరంలోని లోయగ్రామంలో దాదాపు 18-20 లీజులున్నాయు. విలువైన రోడ్‌మెటల్‌, బిల్డింగ్‌ మెటల్‌, ఎర్రమట్టి నిల్వలున్నాయి. సర్వే నంబర్‌ 143లో ఉన్న 98.940 హెక్టార్లలో (244 ఎకరాలు)గ్రావెల్‌, రోడ్‌మెటల్‌ లీజులను 2007లో ఓ కంపెనీకి కేటాయించారు. అక్కడ మైనింగ్‌కు అవసరమైన అన్ని అనుమతులూ పొందాక, ఆ భూమి సర్వేచేయని, రిజర్వ్‌చేయని అటవీ అని ఫారెస్ట్‌ విభాగం అభ్యంతరం లేవనెత్తింది. నిజానికి రెవెన్యూశాఖ సిఫారసుతో అది రెవెన్యూ పోరంబోకు అని రికార్డుల్లో ఉన్న తర్వాతనే లీజులను మంజూరు చేశారు. ఇందుకోసం రెవెన్యూ ఆమోదం తీసుకున్నారు. అటవీ శాఖ అభ్యంతరం లేవనెత్తినప్పుడు అది రెవెన్యూ పోరంబోకు భూమి అని రెవెన్యూశాఖ నిగ్గు తేల్చాలి. కానీ ఆ శాఖ ఈ పనిచేయడం లేదు. అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఫలితంగా గత 18 సంవత్సరాలుగా ఆ లీజుల్లో మైనింగ్‌ జరగడం లేదు. అయితే, ఇందులోనూ ఓ ట్విస్ట్‌ ఉంది. ఆ భూమి పక్కనే ఉన్న ఇతర లీజుల్లో మైనింగ్‌ జరుగుతోంది. కానీ సర్వే నంబర్‌ 143లో మాత్రం ఆపేశారు. కారణాలు ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. నిజంగా దట్టమైన చెట్లున్న భూముల్లో మైనింగ్‌ సాగుతుంటే, చెట్టూచేమలేని చోట మాత్రం అటవీ శాఖ వివాదం రాజేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూశాఖ కదలడం లేదు.

కదలని మైనింగ్‌..

విశాఖజిల్లా నాతవరం మండలంలో 190ఎకరాల్లో లాటరైట్‌ లీజు మైనింగ్‌కు 2014లో అనుమతి ఇచ్చారు. అది రెవెన్యూ పోరంబోకు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అది సర్వేచేయని అటవీభూమి అని ఆ శాఖ అభ్యంతరం చెప్పింది. సరుగుడు పంచాయతీ పరిధిలో 120 ఎకరాల్లో విలువైన లాటరైట్‌ నిక్షేపాలున్నాయి. 2016లోనే లీజులు ఇచ్చారు. కానీ అది అటవీ భూమి అన్న అభ్యంతరం రావడంతో మైనింగ్‌ ముందుకు సాగడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల పరిధిలో 72 గ్రావెల్‌, రోడ్‌మెటల్‌ లీజులు అటవీ వివాదంలో ఇరుక్కున్నాయి.

Updated Date - Jun 11 , 2025 | 04:11 AM