Share News

మైనింగ్‌ గద్దలు..!

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:52 AM

అప్పులు చేసి బోరుబావులు తవ్వుకున్నారు.. పాతాళ గంగమ్మ కరుణించింది..

మైనింగ్‌ గద్దలు..!
యాపర్లపాడు సర్వే నంబరు 238/ఏలో డి-పట్టా పొందిన భూముల్లో రైతులు సాగు చేస్తున్న మిరప,

పేదల భూములపై దౌర్జన్యం

యాపర్లపాడులో 131 ఎకరాలు పేదలకు పంపిణీ

బోరుబావులు తవ్వి పంటలు సాగు

ఆ భూములే జీవనాధారం అంటున్న పేదలు

అక్కడే కిరణ్‌ ఇండసి్ట్రస్‌కు 180 ఎకరాలు మైనింగ్‌ లీజ్‌

16 ఏళ్ల తరువాత వచ్చిన లీజుదారుడు

అన్యాయమైపోతాం అంటున్న సామాన్య రైతులు

అప్పులు చేసి బోరుబావులు తవ్వుకున్నారు.. పాతాళ గంగమ్మ కరుణించింది.. మిరప, పత్తి, మొక్కజొన్న, టమోటా, ఉల్లి వంటి పంటలు సాగుచేస్తున్నారు. పచ్చని పైర్లతో కళకళలా డుతున్న పంట చేలల్లో మైనింగ్‌ పెద్దలు వాలిపోయారు. తాతల కాలం నుంచి ఈ భూము ల్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం.. ఇప్పుడు మైనింగ్‌ లీజులు అంటూ ఎవరో వచ్చి పంట పొలాల నుంచి వెళ్లిపొమ్మంటే ఎక్కడి పోతాం..? సాగులో ఉన్న భూములను వదులుకునే ప్రసక్తే లేదని ఏకరువు పెడుతున్నారు. 2009లో కర్నూలుకి చెందిన ‘కిరణ్‌ ఇండసి్ట్రస్‌’కు యాపర్లపాడు రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబరు 238/ఏలో ఐరన ఓర్‌ తవ్వకాల కోసం 180 ఎకరాలు (72 హెక్టార్లు) ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. 16 ఏళ్ల తరువా త ఆ సంస్థ యజమాని వీవీ సీతారామయ్య వచ్చి ఈ భూములు మైనింగ్‌ లీజు ఉందని.. ఖాళీ చేసి వెళ్లిపోవాలనడంతో పుల్లగుమ్మి గ్రామ పేద రైతులు కన్నీరు పెడుతున్నారు. మైనింగ్‌ లీజుకు ఇచ్చిన భూమెంతా..? అసైనమెంట్‌ చేసిన భూమి ఎంత..? రెవెన్యూ అఽధికారులు అక్రమంగా పట్టాలు జారీ చేసిందెంతా..? వంటి వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు/వెల్దురి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామంలో ఆర్‌ఎస్‌ఆర్‌ రెవెన్యూ రికార్డులు ప్రకారం సర్వే నంబరు 238/ఏలో 724.84 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉంది. కొంత భాగంగా సాగుకు అనుకూలమైతే మరికొంత భూభాగం ఐరనఓర్‌ మైనింగ్‌కు అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 1971లో ప్రభుత్వం రైట్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (ఆర్‌ఓఆర్‌) తీసుకొచ్చింది. సాగు భూములను రైతుల పేరిట రెవెన్యూ రికార్డులో నమోదు చేశారు. అంతకు పూర్వం నుంచే సమీపంలోని వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన పేదలు ప్రభుత్వం భూములను సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న 41 మంది రైతులను గుర్తించి ఆర్‌ఓఆర్‌ రికార్డుల్లో నమోదుచేశారు. మరో 83మంది పేదలు అర్ధ ఎకర, ఎకరం, రెండెకరాలు చొప్పున 131.25 ఎకరాలు సాగు చేసుకుంటున్నా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. 2005లో ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో 131 ఎకరాల ప్రభుత్వ భూమిని అసైనమెంట్‌ చేసి 2005 జనవరి 19న పేజ్‌-1 కింద 49 మంది పేదలకు 74.80 ఎకరాలు, అదే ఏడాది పేజ్‌-2 కింద 22 మందికి 39.35 ఎకరాలు, 2006 అక్టోబరు 24న నాలుగో విడత భూ పంపిణీలో 12 మంది కూలీలకు 17.10 ఎకరాలు డి-పట్టా ఇచ్చారు. అంటే.. ప్రభుత్వం అసైన్మెంట్‌ చేసి 131.25 ఎకరాలు పేదలకు భూయాజమాన్యం హక్కు కల్పించింది. ఆ భూముల్లో బోరుబావులు తవ్వుకొని, మిరప, పత్తి, ఉల్లి, మొక్కజొన్న, టమోటా.. వంటి పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ భూములు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి.

వాలిపోయిన మైనింగ్‌ పెద్దలు

యాపర్లపాడు రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 238/ఏలో ఐరనఓర్‌ మైనింగ్‌ లీజు కోసం కర్నూలు నగరం విఠల్‌నగర్‌కు చెందిన కిరణ్‌ ఇండసి్ట్రస్‌ యజమాని వీవీ సీతారామయ్య 2004లో గనులు భూగర్భ వనరుల శాఖకు దరఖాస్తు చేశారు. అదే ఏడాది రెవెన్యూ అధికారులు, 2005లో అటవీ శాఖ అధికారులు ఎనఓసీ ఇచ్చారు. ఆ తరువాత పర్యావరణం(ఈసీ), ఇండియన బ్యూరో ఆప్‌ మైన్స విభాగం అనుమతులు వచ్చాక 2009 లో మైనింగ్‌ శాఖ అధికారులు ఐరన ఓర్‌ తవ్వకాల కోసం 180ఎకరాలు (72 హెక్టార్లు) లీజు ఇచ్చారు. హెక్టారుకు రూ.6వేలు చొప్పున ఏటా దాదాపు రూ.5లక్షలు లీజు అమౌంట్‌ చెల్లిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 2009 నుంచి 2025-26 వరకు 9,200 మెట్రిక్‌ టన్నులు ఐరనఓర్‌ తవ్వకాలకు పర్మిషన తీసుకున్నారు. మొదట్లో ఐరనఓర్‌ తవ్వకాలు చేపట్టిన కంపెనీ తరువాత ఆపేసింది. దాదాపు 15ఏళ్ల తరువాత ఇప్పుడొచ్చి ఈభూముల్లో మైనింగ్‌ లీజు ఉంది.. వెళ్లిపొమ్మని కిరణ్‌ ఇండసి్ట్రస్‌ యజమాని వీవీ సీతారామయ్య అంటున్నారు. సాగులో ఉన్న పేద రైతులకు ఏ మాత్రం చెప్పకుండా ఏకంగా ఎక్స్‌క వేటర్‌తో రహదారి పనులు చేపట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. మా భూములను మైనింగ్‌ పెద్దల నుంచి కాపాడండి అంటూ ఏకరువు పెడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్యకు ఫిర్యాదు చేశారు. మైనింగ్‌ లీజ్‌ యాక్ట్‌ ప్రకారం రైతువారి పట్టా భూములైనా, డి-పట్టా భూము ల్లోనైనా మైనింగ్‌ లీజు తీసుకుంటే ఆ రైతులను సంప్రదించి భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి మైనింగ్‌ చేసుకోవచ్చని మైనింగ్‌ అధికారులు అంటున్నారు. లేదంటే రెవెన్యూ అధికారుల ద్వారా భూ సేకరణ చేయించి ఆ తరువాతే మైనింగ్‌ కార్యకలాపాలు చేయాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా ఎక్స్‌కవేటర్లు పొలాల్లో దింపడంతో ఎక్కడ మా భూములు పోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మైనింగ్‌ పెద్దల నుంచి మా భూములు కాపాడాలని వేడుకుంటున్నారు.

అక్రమంగా ఆనలైనలో నమోదు

ఖాళీ భూమే కాదని కన్నేశారు.. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమంగా తమ పేరిట ఆనలైన్లో నమోదు చేసుకున్నారు. 2010-13 మధ్యలో 15 మంది 40-45 ఎకరాలకు డి-నమూనా పట్టాలు తీసుకుంటే.. మరో పది మందికిపైగా ఎలాంటి పట్టాలు లేకుండా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సుమారుగా 35ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఆనలైనలో తమ పేరిట నమోదు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

72 హెక్టార్లకు మైనింగ్‌ లీజ్‌ ఉంది

యాపర్లపాడు రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబరు 238/ఏలో 72 హెక్టార్లు కిరణ్‌ ఇండసి్ట్రస్‌ సంస్థకు ఐరనఓర్‌ మైనింగ్‌ లీజుకు తీసుకున్నారు. 2004లో దరఖాస్తు చేస్తే. 2009లో లీజు అనుమతులొచ్చాయి. ఆ రోజు నుంచి క్రమం తప్పక లీజు అమౌంట్‌ చెల్లిస్తున్నారు. 2015లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2059 వరకు లీజు ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ డి-పట్టా భూముల్లో మైనింగ్‌ లీజు ఇవ్వవచ్చు. లీజు సంస్థ సంబంధిత భూ యజమానితో చర్చించి ప్రభుత్వ నిబంధనలు మేరకు భూ నష్టపరిహారం చెల్లించి మైనింగ్‌ చేసుకోవచ్చు.

ఫ రవిచంద్ర, డీడీ, గనులు భూగర్భ వనరుల శాఖ, కర్నూలు:

విచారణ చేస్తున్నాం

కల్లూరు మండలం యాపర్లపాడు రెవిన్యూ గ్రామం సర్వే నంబరు 238/ఏలో 724.84 ఎకరాలు ఉంటే.. అందులో 131.25 ఎకరాలు అసైన్మెంట్‌ చేసి 2005, 2006లో మూడు విడతల్లో 83 మంది పేదలకు డి-పట్టా జారీ చేశారు. 1971కి మందే మరో 41 మంది రైతులు సాగులో ఉన్నట్లు ఆర్‌ఓఆర్‌లో నమోదు చేశారు. అదే సర్వే నంబరులో 72 హెక్టార్లు కిరణ్‌ ఇండస్ర్టిస్‌కు లీజుకు ఇచ్చారు. అసైనమెంట్‌ చేసిన భూములు, మైనింగ్‌ లీజుకు ఇచ్చిన భూములు ఒకటేనా? వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయా? క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక ఇస్తాం. డి-పట్టా పొందిన రైతులకు న్యాయం చేస్తాం.

ఫ నాగరాజు, తహసీల్దారు, కల్లూరు

పొలాలు వదలం..

మాకు 2.70 ఎకరాలు ఉంది. బోరుబావి తవ్వుకొని టమోటా, మిరప పంటలు సాగు చేసి జీవిస్తున్నాం. ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూమి ఇది. ఎకరం రూ.15 లక్షలు పలుకుతుంది. ఇప్పుడొచ్చి మైనింగ్‌ లీజు ఉందంటే ఎక్కడి పోతాం. పొలాలు వదిలివెళ్లే ప్రసక్తే లేదు.

ఫ బి.రాముడు, పుల్లగుమ్మి గ్రామం, వెల్దుర్తి మండలం

ఆత్మహత్యలే శరణ్యం

మాకున్నది 2.11 ఎకరాల భూమే. మూడు తరాలుగా మావంశీయుల ఆధీనంలో ఉంది. బోరుబావులు తవ్వుకొని పత్తి, మిరప, కంది సాగుచేస్తున్నాం. కుటుంబం మొత్తం ఈ పొలంలో పనిచేసి జీవిస్తున్నాం. మైనింగ్‌ అంటూ మా పొట్టకొడితే ఆత్మహత్యలే శరణ్యం.

- తలారి నాగరాజు, పుల్లగుమ్మి,

Updated Date - Jul 03 , 2025 | 12:52 AM