Child Welfare Secretary Suryakumari: మినీ అంగన్వాడీలకు మహర్దశ
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:24 AM
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా...
4,687 మినీ కేంద్రాల ఉన్నతీకరణ
టెన్త్ ఉత్తీర్ణులైన కార్యకర్తలకు పదోన్నతి
వారి నెల వేతనం రూ.11,500కు పెంపు
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరిస్తూ మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 4,687 మినీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించింది. ఆ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పదో తరగతి ఉత్తీర్ణులైన కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించింది. మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బందికి ఇప్పటి వరకు నెలకు రూ.7వేలు గౌరవ వేతనంగా వచ్చేది. పదోన్నతి లభించడంతో ఇకపై వారి గౌరవ వేతనం రూ.11,500కు పెరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా పది మంది కంటే తక్కువ లబ్ధిదారులు ఉండి, కిలోమీటరు పరిధిలోనే మరో కేంద్రం ఉన్న 340 మినీ అంగన్వాడీ కేంద్రాలు సమీప కేంద్రాల్లో విలీనం చేయనున్నట్లు తెలిపారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.