Share News

మిల్లర్ల దగా!

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:06 AM

ధాన్యం కొనుగోలులో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. యంత్రాలతో కోసి ధాన్యం ఆరబెట్టిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని సంచుల్లోకి ఎత్తుతున్నారు. వెంటనే పంపాల్సిన వాహనాలను మిల్లర్లు కావాలని ఆలస్యంగా పంపుతున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల పాటు సంచుల్లో నిల్వ ఉన్న ధాన్యంలో తేమశాతం పెరిగి రంగుమారుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లు యజమానులు ధాన్యం నాణ్యతగా లేదని వంకలు పెడుతూ 75 కిలోల బస్తాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు తగ్గించి ఇస్తామని బేరం పెడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు వారు చెప్పినట్టే చేస్తున్నారు. ఒక లారీ ధాన్యానికి రూ.35 వేల వరకు నష్టపోతున్నారు.

మిల్లర్ల దగా!

- ధాన్యం కొనుగోలులో మాయాజాలం

- ఆర్‌ఎస్‌కేలో పేరు నమోదు చేసుకుని ధాన్యం సంచుల్లోకి ఎత్తుతున్న రైతులు

- వాహనాలు పంపడంలో జాప్యం చేస్తున్న మిల్లు యజమానులు

- సంచుల్లో నిల్వ ఉండటంతో తేమశాతం పెరిగి రంగు మారుతున్న ధాన్యం

- నాణ్యత లేదంటూ బస్తాకు 5 నుంచి 6 కిలోల తగ్గింపు

- ఒక లారీ ధాన్యానికి మద్దతు ధరలో రూ.35 వేలు వరకు కోత

- ఆందోళన చెందుతున్న అన్నదాతలు

ధాన్యం కొనుగోలులో మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. యంత్రాలతో కోసి ధాన్యం ఆరబెట్టిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని సంచుల్లోకి ఎత్తుతున్నారు. వెంటనే పంపాల్సిన వాహనాలను మిల్లర్లు కావాలని ఆలస్యంగా పంపుతున్నారు. దీంతో ఒకటి రెండు రోజుల పాటు సంచుల్లో నిల్వ ఉన్న ధాన్యంలో తేమశాతం పెరిగి రంగుమారుతోంది. దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లు యజమానులు ధాన్యం నాణ్యతగా లేదని వంకలు పెడుతూ 75 కిలోల బస్తాకు ఐదు నుంచి ఆరు కిలోల వరకు తగ్గించి ఇస్తామని బేరం పెడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు వారు చెప్పినట్టే చేస్తున్నారు. ఒక లారీ ధాన్యానికి రూ.35 వేల వరకు నష్టపోతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా రైతులు అందుబాటులో ఉన్న యంత్రాల ద్వారా వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ధాన్యం ట్రాక్టర్ల ద్వారా రహదారులపైకి చేర్చుతున్నారు. మచిలీపట్నం- విజయవాడ జాతీయ రహదారి గుడివాడ, పామర్రు, పెడన, మొవ్వ తదితర ప్రాంతాల్లో రహదారులపై ధాన్యం ఆర బెడుతున్నారు. వాతావరణం బాగుండక పోవడంతో రైతులు ధాన్యం త్వరితగతిన విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. రైతు సేవా కేంద్రాలకు వెళ్లి అక్కడ తమ పేర్లు నమోదు చేయించుకుని ధాన్యం సంచులకు ఎత్తుతున్నారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమవుతోంది. ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీలు, ట్రాక్టర్లను సకాలంలో పంపకుండా మిల్లు యజమానులు కావాలని జాప్యం చేస్తున్నారు. ఒకటీ రెండు రోజులు ఆలస్యంగా లారీలను పంపి ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారు. సంచుల్లోనే ఒకటీ రెండు రోజులపాటు ధాన్యం ఉండటంతో తేమశాతం పెరిగి, ధాన్యం రంగు మారుతోంది. దీంతో మిల్లర్లు రైతులను పిలిపించి ధాన్యం నాణ్యత సక్రమంగా లేదని, రంగు మారిందని, తప్ప, తాలుశాతం అధికంగా ఉందని తదితర కారణాలు చెప్పి 75 కిలోల బస్తాకు ఐదు నుంచి ఆరు కిలోలు తగ్గిస్తామని బేరం పెడుతున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే వేరే మిల్లుకు ధాన్యం తీసుకెళ్లి విక్రయించుకోవాలని చెబుతున్నారు. దీంతో 350 బస్తాల ధాన్యం ఉన్న లారీలో బస్తాకు ఐదు నుంచి ఆరు కిలోలను తగ్గిస్తే రూ.35 వేల వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. దిక్కుతోచని స్థితిలో రైతులు మిల్లర్లు చెప్పిన షరతులకు ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

కలెక్టర్‌తో మాట్లాడి న మంత్రి కొలుసు

జిల్లాలో గత పదిరోజులుగా యంత్రాలతో వరి కోతలు ఊపందుకున్నాయి. కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం సౌత మండలాల్లో మినహా అన్ని మండలాల్లో జోరుగా సాగుతున్నాయి. దీంతో వరి కోతలు పూర్తి చేసిన రైతులు పొలాల్లో నుంచి ధాన్యం తీసుకువచ్చి రహదారులపై పోసి ఆర బెడుతున్నారు. మొవ్వ మండలంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి కొలుసు పార్థసారధి పామర్రు, పరిసర ప్రాంతాల్లో మచిలీపట్నం-విజయవాడ జాతీయ ర హదారి పొడవునా ఉన్న ధాన్యం రాశులను చూసి ఆగి రైతులతో మాట్లాడారు. ధాన్యంలో నాణ్యత సక్రమంగా లేదని, రంగు మారిందనే కారణాలు చూపి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వాహనాలను సకాలంలో పంపడం లేదని రైతులు మంత్రి ఎదుట వాపోయారు. దీంతో మంత్రి వెంటనే కలెక్టర్‌ బాలాజీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. పామర్రు మండలం బల్లిపర్రుకు చెందిన రైతులతోపాటు ఇతర గ్రామాల రైతులు రహదారి పొడవునా ధాన్యం రాశులుగా పోసి ఆరబెడుతున్నారని తెలిపారు. వాహనాలు సమకూర్చడం లేదని రైతులు చెబుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. వెంటనే రహదారులపై ఉన్న ధాన్యం మిల్లులకు తరలించాలని, పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వంపె రైతుల్లో వ్యతిరేకత వస్తుందని, ఒకసారి ఆలోచించాలన్నారు. పోలీసుల సాయంతోనైనా లారీలను తీసుకువచ్చి ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించారు. లారీ యజమానులు, అన్ని మండలాల అధికారులతో సమన్వయం చేసుకుని ధాన్యం మిల్లులకు తరలించాలన్నారు. కాగా, కలెక్టర్‌ బాలాజీ గుడ్లవల్లేరు మండలం వేమవరపాలెంలో రహదారిపై ధాన్యం ఆరబెడుతున్న రైతులతో మాట్లాడారు. అబ్దుల్‌ సలాం అనే రైతు ఎకరంన్నర పొలంలో 1318 రకం వరి విత్తనం సాగుచేశానని, మంగళవారం యంత్రం ద్వారా కోత కోయించానని, ధాన్యంలో తేమశాతం తగ్గించేందుకు ఆరబెడుతున్నానని చెప్పారు. మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షంతో ధాన్యంలో కొంతమేర మానుగాయ వచ్చిందని తెలిపారు. ఎంత ధరకు ధాన్యం కొనుగోలు చేస్తారోనని అనుమానం వ్యక్తం చేశారు.

తెలంగాణ సరిహద్దులో ధాన్యం లారీల నిలిపివేత

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు జిల్లాకు వచ్చి స్థానిక వ్యాపారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం లారీలు గరికపాడు చెక్‌పోస్టు దాటి తెలంగాణ సరిహద్దులోకి వెళ్లగానే నిలిపివేస్తున్నారని జిల్లాకు చెందిన వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ధాన్యం విలువలో ఒకశాతాన్ని సెస్‌గా చెల్లిస్తే సరిపోయేదని, ప్రస్తుతం రెండు శాతం సెస్‌ రూపంలో చెల్లించాలని తెలంగాణ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ఖమ్మం, సూర్యారావుపేట నుంచి మండపేటకు వెళ్లే ధాన్యం లారీలను ఒకశాతం సెస్‌ చెల్లింపు చేస్తే మన రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారని, ఈ పరస్పర విరుద్ధ నిబంధనలు ఏమిటో అర్థం కావడం లేదని ధాన్యం వ్యాపారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి ధాన్యం వెళితే కొంత మేర ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తొలగుతాయని వ్యాపారులు అంటున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 01:06 AM