మిల్లర్ల దోపిడీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:03 AM
‘‘సార్ మిల్లర్ల దోపిడీతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఆర్‌ఎస్‌కేల్లో తేమశాతం పట్టించుకోవటం లేదు. లోడు వెళ్లాక మళ్లీ మిల్లర్ తేమశాతం పరీక్ష చేసి ఎక్కువ చెప్పి ధాన్యం కోత విధిస్తున్నారు. దీంతో ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక నష్టానికి ధాన్యం అప్పగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఈ దోపిడీని అరికట్టాలి’’ అంటూ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతులు వేడుకున్నారు.
-తేమశాతం అధికంగా చూపి ధాన్యంలో కోత పెడుతున్నారు
-ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక నష్టానికి ధాన్యం అప్పగిస్తున్నాం
- నార్తువల్లూరులో రైతులతో ముఖాముఖిలో మంత్రి మనోహర్ ఎదుట అన్నదాతల ఆవేదన
తోట్లవల్లూరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
‘‘సార్ మిల్లర్ల దోపిడీతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఆర్‌ఎస్‌కేల్లో తేమశాతం పట్టించుకోవటం లేదు. లోడు వెళ్లాక మళ్లీ మిల్లర్ తేమశాతం పరీక్ష చేసి ఎక్కువ చెప్పి ధాన్యం కోత విధిస్తున్నారు. దీంతో ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక నష్టానికి ధాన్యం అప్పగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఈ దోపిడీని అరికట్టాలి’’ అంటూ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రైతులు వేడుకున్నారు. తోట్లవల్లూరులోని నార్తువల్లూరు పీఏసీఎస్ కార్యాలయం వద్ద శనివారం మంత్రితో ధాన్యం రైతుల ముఖాముఖి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ రైతులు తమ సమస్యలను మంత్రి మనోహర్‌కు తెలియజేయాలని కోరారు. దీంతో దేవరపల్లికి చెందిన రైతు జొన్నల గురుప్రసాద్‌రెడ్డి నిలబడి తాను పెనమకూరు ఆర్‌ఎస్‌కే ద్వారా దావులూరిలోని బాలాజీ రైస్‌మిల్లుకు 336 ధాన్యం బస్తాలను డిసెంబరు 11వ తేదీన తీసుకెళ్లానని, అక్కడ తేమ శాతం చూసి, ఎక్కువగా ఉందని చెప్పి ఏడు బస్తాల ధాన్యం తగ్గించి 329 బస్తాలకు లెక్కగట్టారని, రూ.1,289 ఎదురు చెల్లించాల్సి వచ్చిందని మంత్రికి వివరించారు. ఇక్కడ ఏడు బస్తాలను తాను నష్టపోయానన్నారు. భద్రిరాజుపాలేనికి చెందిన తిరుమలరెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌కేల్లో తేమ శాతం మిషన్‌లు, మిల్లర్ల వద్ద తేమ శాతం మిషన్‌లు వేర్వేరుగా ఉన్నాయని, దీంతో మిల్లర్ వద్ద తేమ శాతం అధికంగా చూపుతోందన్నారు. ఇది రైతులకు నష్టం కలిగిస్తోందని చెప్పారు. తోట్లవల్లూరుకు చెందిన మరో రైతు తోట సాయిబాబు మాట్లాడుతూ మొంథా తుఫానుకు అరటి తోటలు నష్టపోతే అధికారులు లంకలకు రాలేదని, పంట నష్టాన్ని నమోదు చేయలేదని, సాయం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయాడు. లంకల్లోని కొన్ని పొలాల రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రాలేదని చెప్పారు. తోడేళ్ల దిబ్బలంకకు చెందిన రైతు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ లంకకు సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్నామని, ఒక్కొక్కరు రూ.2 వేలు చందాలు వేసుకుని నదీపాయలో రోడ్డు నిర్మించుకుంటున్నామని, రేషన్ బియ్యం తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.
మాది రైతులకు మేలు చేసే ప్రభుత్వం
అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేవరపల్లి రైతుకు జరిగిన ధాన్యం నష్టంపై వేదికపై నుంచే మిల్లర్‌తో మాట్లాడి ఏడు బస్తాలకు డబ్బులు రైతుకు వేయించటం జరిగిందని వెల్లడించారు. బయటి జిల్లాలకు చెందిన 106 రైస్‌మిల్లర్లకు కృష్ణాజిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవకాశం కల్పించి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.7,365 కోట్లు జమ చేశామని, ధాన్యం విక్రయించిన గంటల వ్యవధిలోనే డబ్బులు జమ చేస్తున్న ఘనత దేశంలో మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టిందని, మిల్లర్లకు రూ.450 కోట్లు, పీఏసీఎస్‌కు రూ.160 కోట్లు, చివరకు రూ.26 కోట్లు ట్రాన్స్‌పోర్ట్ బకాయిలు పెట్టిందని చెప్పారు. వాటన్నింటిని తాము చెల్లించుకుంటూ వస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణలో పామర్రు నియోజకవర్గం నెంబర్ వన్ స్థానంలో ఉందని, 1.48 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం సేకరించి రూ.300 కోట్లు ఈ నియోజకవర్గం రైతులకు చెల్లించామని తెలిపారు. అందుచేతనే నెలలోను రెండు సార్లు పామర్రు నియోజకవర్గానికి వచ్చానన్నారు. రైతులు వ్యవసాయంలో మార్పులకు సిద్ధపడాలని, ఆదాయం వచ్చే పంటలు, ఉద్యానవన పంటల వైపు కూడా దృష్టి నిలపాలని రైతులను కోరారు. క్యూఆర్ కోడ్‌తో ధాన్యం బస్తాలను విక్రయిస్తే కేంద్రప్రభుత్వం కొనుగోలు చేస్తానని ముందుకు రావటం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ మంత్రి మనోహర్ పర్యటనతో రైతులకు ధైర్యం వచ్చిందని, ధాన్యం రవాణాకు గుడివాడలో రైలును ఏర్పాటు చేసిన ఘనత మంత్రికి దక్కుతుందన్నారు. లంకల్లో రైతులకు అన్నదాత సుఖీభవ సాయం విడుదలపై మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీవో హేలా షారోన్, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జి తాడిశెట్టి నరేష్, టీడీపీ మండల అధ్యక్షుడు వీరపనేని శివరామ్, తహసీల్దార్ ఎం.కుసుమకుమారి, వ్యవసాయాధికారిణి జి.శ్రీదేవి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.
ఆఫీసుల్లోనే కాదు పొలాలకు రావాలి
వ్యవసాయాధికారులకు మంత్రి నాదెండ్ల క్లాస్
వ్యవసాయాధికారులు ఆఫీసుల్లో కూర్చోవటమే కాదని, పొలాలకు వెళ్లి రైతులను కలుసుకుని సాగు పద్ధతుల్లో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తోట్లవల్లూరు బాడవ పొలాల్లో శనివారం వరికుప్ప నూర్పిళ్లను మంత్రి పరిశీలించారు. కౌలురైతు ముసిబోయిన నాంచారయ్య చేపట్టిన వరి కుప్పనూర్పిడి వద్దకు వెళ్లి పలుకరించటంతో తాను మూడు ఎకరాలలో కౌలుకు 1061 రకం వరి సాగు చేశానని, గత నెలలో వచ్చిన మొంథా తుఫానుకు గింజ పాలు పోసుకునే సమయంలో పడిపోయిందని, ఆ తర్వాత డిసెంబరులో వచ్చిన వర్షాలకు వరిచేనంతా తడిసిపోయి గింజలు నలుపు రంగులోకి వచ్చాయని తెలిపారు. ఎకరానికి రూ.4,500 చెల్లించి కోత కోయించానని, రూ.6 వేలు చెల్లించి కుప్ప వేశానని, ఇపుడు రూ.8 వేలతో నూర్పిడి చేయిస్తున్నానని చెప్పారు. తాలు ఎక్కువగా ఉండటంతో ఎకరాకు 20 బస్తాల ధాన్యం కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని, భూ యజమానికి 15 బస్తాల కౌలు చెల్లించాల్సి ఉందని మంత్రికి వివరించాడు. కొంత ఆలస్యమైనా పంట నష్టపరిహారం వస్తుందని, ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు మీరు మారాలని, అధికారులు సూచించే రకాలను సాగుచేస్తే వర్షాలకు పంట నష్టం జరగదని తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ, సచివాలయ వీఏఏలతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ రైతులు ఇలాంటి సున్నితమైన వరిని సాగు చేస్తుంటే మీరేమి చేస్తున్నారని, ఆఫీసుల్లో కూర్చోవటమే కాకుండా పొలాలకు వచ్చి రైతులతో మాట్లాడి వర్షాలను తట్టుకునే రకాలను సాగుచేయించే ప్రయత్నాలు ఎందుకు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ పరిధిలో ఎంతమంది రైతులున్నారని మహిళా వీఏఏని మంత్రి మనోహర్ ప్రశ్నించగా, 256 మంది ఉన్నారని తెలిపింది. వారి వివరాలు నీ వద్ద ఉన్నాయా అని మంత్రి అడగ్గా లేవని చెప్పటంతో ఇంకా మీరు అప్‌డేట్ కాకపోతే ఎలా అని, 256 మంది రైతుల ఫోన్ నెంబర్‌లతో ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి వారికి సాగుకి అవసరమైన మెసేజ్‌లు పెడితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని మనోహర్ సూచించారు.