Kurnool: తరలెళ్లిపోతున్న పల్లె జనం
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:08 AM
అది కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామం. ఆ గ్రామం నుంచి ఒక్కరోజే రెండు వందలకు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వలస వెళ్లిన వారిలో 25 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.
కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు
ఊళ్లను వదిలి వెళుతున్న రైతులు, కూలీలు
తెలంగాణ, గుంటూరులో పత్తితీత పనులు
పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు
పాఠశాలల్లో తగ్గిపోతున్న హాజరు
సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట!
ధర లేక ఉల్లి కన్నీళ్లు పెట్టించింది. వర్షాలకు తెల్లబంగారం (పత్తి) నల్లబారింది. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడి మట్టిపాలైంది. ఊళ్లో పనుల్లేవు.. కుటుంబ పోషణకు దారిలేదు. పొట్టకూటి కోసం పల్లెజనం వలస బాట పడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. వందల సంఖ్యలో కుటుంబాలు తరలివెళ్లిపోతున్నాయి. జనంలేక పల్లెసీమలు బోసిపోతున్నాయి. ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ఇదీ కర్నూలు జిల్లాలోని గ్రామాల ప్రస్తుత పరిస్థితి.
(కర్నూలు- ఆంధ్రజ్యోతి)
అది కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామం. ఆ గ్రామం నుంచి ఒక్కరోజే రెండు వందలకు పైగా కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వలస వెళ్లిన వారిలో 25 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కర్నూలు జిల్లాలో వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. చింతకుంటతో పాటు.. కోసిగి, దుద్ది, చిన్నభూంపల్లి, దొడ్డి బెళగల్, అర్లబండ, సజ్జలగుడ్డం, వందగల్లు, జంపాపురం, దొడ్డి, పల్లెపాడు తదితర గ్రామాల నుంచి పల్లె జనం వలస వెళ్లారు. ఒక్కో గ్రామంలో కనీసం 50 నుంచి 100 కుటుంబాలకు పైగా ఇప్పటికే ఊరు వదిలి వెళ్లారు. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు, ఏపీలోని గుంటూరు జిల్లాకు వెళ్తున్నారు. మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పది వేల కుటుంబాలు పొట్టచేత పట్టుకొని సుగ్గి బాటన సాగిపోయి ఉంటారని అనధికారిక అంచనా. దీంతో గ్రామాలన్నీ బోసిపోతున్నాయి. తల్లిదండ్రులతో పిల్లలు కూడా వెళ్లడంతో పాఠశాలల్లో హాజరు తగ్గిపోతోంది.
కిలో పత్తి తీస్తే రూ. 15
కర్నూలు జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అత్యధికంగా పత్తిసాగు చేసిన జిల్లాల్లో గుంటూరు తర్వాతి స్థానం దీనిదే. అయితే అధిక వర్షాలకు తేమ ఎక్కువై చెట్టుపైన కాయలు నల్లగా మారి కుళ్లిపోయాయి. ఉన్న అరకొర పత్తి చెట్టుపైనే మొలకలొచ్చి నేలపాలయింది. ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లకు పైగా దిగుబడి రూపంలో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పెద్ద రైతులు పత్తితీత పనులకు పిలిచినా రూ. 300-400 మించి కూలి ఇవ్వడం లేదు. ఆరు నెలలుగా ఉపాధి హామీ కూలి డబ్బులు అందకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారం అవుతుండటంతో వలసబాట పట్టారు. మహబూబ్‌నగర్, వికారాబాద్, గుంటూరులో కిలో పత్తి తీస్తే రూ. 15 నుంచి రూ. 18 చొప్పున ఇస్తున్నారు. ‘దంపతులిద్దరూ రోజుకు వంద కిలోల పత్తి తీస్తే రూ. 1,500 వస్తుంది. ఇద్దరు పిల్లలు కూడా పనిలోకి వెళితే మరో రూ.వెయ్యి సంపాదించవచ్చు. ఇలా రోజుకు సుమారు రూ. 2,500, నెలంతా కష్టపడితే దాదాపు రూ.50 వేల నుంచి 60 వేలు సంపాదించుకోవచ్చని వలస బాట పట్టారు. గుంటూరు జిల్లాలో పత్తి తీత పనులు అయిపోగానే మిరప కోత పనులు మొదలవుతాయి. నాలుగైదు నెలలు పనులు ఉంటాయని ఆ జిల్లాకు ఎక్కువ వెళ్తున్నారు.
ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే..
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణే ప్రధాన లక్ష్యంగా 2019లో నాడు టీడీపీ ప్రభుత్వం వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి నిధుల మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులను అటకెక్కించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో ఈ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని రైతులు ఆశించినా ఇప్పటి వరకూ పనుల్లో కదలికలేదు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం పల్లెసీమల వలసలకు అడ్డుకట్ట వేయాలంటే ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణమే ఏకైక పరిష్కార మార్గమని రాయలసీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.
ఆరెకరాలున్నా.. వలస బాటే
చింతకుంటకు చెందిన పుసులు యల్లప్ప, పద్మ దంపతులకు బోరుబావి కింద ఆరెకరాల పొలం ఉంది. 3 ఎకరాల్లో పత్తి, మరో 3 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. రూ.4 లక్షలకు పైగా అప్పు చేశారు. ధరలు పతనమవడంతో ఉల్లి పంటను పొలంలోనే వదిలేశారు. అధిక వర్షాలకు పత్తికూడా పాడైపోయింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక బడికి వెళ్లే ఇద్దరు పిల్లలను తీసుకొని వికారాబాద్‌కు వలస వెళ్తున్నానని యల్లప్ప చెప్పాడు.