Share News

Minister Satya Kumar: సహజ ప్రసవాల పెంపునకు మిడ్‌వైవ్స్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:35 AM

రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాల తగ్గింపుపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశగా సుశిక్షితులైన మిడ్‌వైవ్స్‌ ద్వారా సహజ ప్రసవాల్ని ప్రోత్సహించే పథకానికి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌...

Minister Satya Kumar: సహజ ప్రసవాల పెంపునకు మిడ్‌వైవ్స్‌

  • 86 ప్రభుత్వాసుపత్రుల్లో 1,264 మందికి ప్రసూతి సహాయకుల నియామకం

  • ఒక్కొక్కరికీ శిక్షణకు 2.50 లక్షల వ్యయం: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాల తగ్గింపుపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశగా సుశిక్షితులైన మిడ్‌వైవ్స్‌ ద్వారా సహజ ప్రసవాల్ని ప్రోత్సహించే పథకానికి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ప్రసవ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్‌ నర్సులే ప్రసూతి సేవల్ని అందిస్తున్నారు. వీరికి వివిధ అంశాలపై తగిన పరిజ్ఞానం, శిక్షణ కొరవడటంతో సిజేరియన్‌ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ లోటును తీర్చేందుకు ఎంపిక చేసిన స్టాప్‌ నర్సులకు 18 నెలల పాటు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ప్రసవానంతర సేవలకు సంబంధించిన అంశాలపై సమగ్ర శిక్షణ అందించి మహిళలు సహజ ప్రసవాల పట్ల మొగ్గు చూపేలా ఈ ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. తొలి విడతలో సంవత్సరానికి 600 నుంచి 6 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్న 86 ప్రభుత్వాసుపత్రుల్లో సుశిక్షితులైన 1,264 మంది ప్రసూతి సహాయకుల్ని నియమిస్తారు. వారు వివిధ సమయాల్లో అందించాల్సిన సేవలు, విధులపై సమగ్ర జాబ్‌చార్టును రూపొందించి ప్రసూతి సేవల నాణ్యతను ఈ పథకం కింద పెంచుతారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద అమలయ్యే ఈ పథకానికి సంబంధించిన పలు అంశాల్ని లోతుగా చర్చించి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన ప్రతి స్టాఫ్‌ నర్సుకు 18 నెలల పాటు సమగ్రమైన శిక్షణ అందించడానికి స్టైఫండ్‌తో కలిపి రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 56.12 శాతం సిజేరియన్‌ ప్రసవాలు జరిగినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వాసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 41.40 శాతం సిజేరియన్లు కాగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 67.71 శాతం మేరకు సిజేరియన్‌ ప్రసవాలు జరిగాయి.

Updated Date - Jul 23 , 2025 | 05:36 AM