High Court Ruling: దరఖాస్తులో ఏమున్నా.. ‘మెరిట్’కే ప్రాధాన్యం!
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:57 AM
డీఎస్సీ 2025 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు దశలోనే ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది...
అప్లికేషన్ దశలో ‘ప్రాధాన్యత’ కోరడం సరికాదు
ఎస్‌జీటీ కోరుకున్నారని.. ప్రతిభ ఉన్న అభ్యర్థినిఎస్‌ఏ పోస్టుకు అర్హులు కాదని చెప్పడానికి వీల్లేదు
2 పోస్టులకు ఎంపికైన వారికి కోరుకున్నది ఇవ్వొచ్చు
వేర్వేరుగా ఫీజులు కట్టారు.. పరీక్షలు కూడా రాశారు
డీఎస్సీ పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు
ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జిదేనని వెల్లడి
4 వారాల్లో తుది నిర్ణయం వెల్లడించాలని సూచన
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు దశలోనే ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ప్రాధాన్యతలు ఎంపిక చేసుకోవాలని అభ్యర్థులను కోరి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సెకండరీ గ్రాడ్యుయేట్ టీచర్(ఎ్‌సజీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎ్‌సఏ) పోస్టులకు నిర్వహించిన రెండు పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థి, దరఖాస్తు దశలో ఎస్‌జీటీ పోస్టుకు ప్రాధాన్యత ఇచ్చారనే కారణంతో ఎస్‌ఏ పోస్టుకు అర్హులుకాదని చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఎస్‌ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించి, వేర్వేరుగా ఫీజులు వసూలు చేసి, వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారని గుర్తు చేసింది. రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుకే పరిమితం చేయడం సరికాదని, మెరిట్ ఆధారంగా ‘ఎస్‌ఏ’ పోస్టుల ఎంపికలో పిటిషనర్లను పరిగణనలోకి తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రాధాన్యత అంశాన్ని తేల్చే వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే అప్పగించింది. ఇరుపక్షాల వాదనలువిని 4 వారాల్లో తుది తీర్పు వెల్లడించాలని సింగిల్ జడ్జిని కోరింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పాఠశాల విద్యశాఖ ముఖ్యకార్యదర్శి వేసిన అప్పీల్‌ను పరిష్కరించింది.
వివాదం ఇదీ..
ప్రభుత్వ పాఠశాలల్లో ఎ్‌సజీటీ, ఎ్‌సఏ పోస్టులతో పాటు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ), ఫిజకల్ ఎడ్యుకేషన్ టీచర్స్(పీఈటీ) పోస్టుల భర్తీకి గత ఏప్రిల్‌లో విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత మేరకు అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది. పిటిషనర్లు ఎస్‌జీటీ, ఎస్‌ఏ పోస్టులకు పరీక్ష రాసి రెండిట్లోనూ అర్హత సాధించారు. మెరిట్ జాబితాలో సైతం ర్యాంక్ సాధించారు. అయితే, దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎస్‌జీటీ పోస్టుకు ఎంపిక చేసి, ఎస్‌ఏ పోస్టుకు అవకాశం కల్పించలేదు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్ సహా 10 మంది అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్. విజయ్.. మెరిట్ ఉన్నప్పటికీ దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యత క్రమం కారణంగా ఎస్‌ఏ పోస్టుకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఎంపికలో పిటిషనర్లను పరిగణనలోకి తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రాధాన్యత క్రమాన్ని మార్చలేరు: ఏజీ
మంగళవారం విచారణలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఒకసారి ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకున్న తర్వాత దానిని మార్చలేరు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అభ్యర్థులు సవాల్ చేయలేరు. ఎస్‌జీటీ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఆ పోస్టులకే ప్రాధాన్యత ఇచ్చారు. పిటిషనర్ల అభ్యర్థన అంగీకరిస్తే, మరింత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉంది’’ అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జీవీఎస్ కిశోర్‌కుమార్, న్యాయవాది గొట్టిపాటి కవిత వాదనలు వినిపిస్తూ.. ‘‘మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధన కారణంగా మెరిట్ అభ్యర్థులు ఎస్‌ఏ పోస్టుకు అర్హత కోల్పోతున్నారు’’ అని తెలిపారు.