Share News

Ongole: ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

ABN , Publish Date - Aug 11 , 2025 | 04:29 AM

మతిస్థిమితం లేని వ్యక్తి పూటుగా మద్యం సేవించి బస్టాండ్‌లో ఖాళీ ఉన్న ఆర్టీసీ బస్సును అపహరించి తీసుకెళ్లాడు

Ongole: ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు

  • తాళం బస్సుకే ఉంచి విశాంత్రి గదికి వెళ్లిన డ్రైవర్‌

  • ఇదే అదనుగా బస్సుతో ఉడాయించిన వ్యక్తి

  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తింపు

ఒంగోలు క్రైం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేని వ్యక్తి పూటుగా మద్యం సేవించి బస్టాండ్‌లో ఖాళీ ఉన్న ఆర్టీసీ బస్సును అపహరించి తీసుకెళ్లాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది దూరంలోనే బస్సును అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కర్నూల్‌-1 డిపోకు చెందిన బస్సును ఒంగోలు బస్టాండ్‌లో పార్కు చేసిన డ్రైవర్‌ తాళాలను బస్సుకే ఉంచి విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి ఆ బస్సు ఎక్కి డ్రైవింగ్‌ చేసుకుంటూ తీసుకెళ్లాడు. బస్టాండ్‌లో ఉన్న కొందరు ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని డిపోలోని ఔట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఒంగోలులోని కర్నూల్‌రోడ్డు ఫ్లైవోవర్‌ వద్ద బస్సును అడ్డుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సును ఆర్టీసీ బస్టాండ్‌కు, నిందితుడిని ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Updated Date - Aug 11 , 2025 | 04:29 AM