Memorial Management: అయ్యో అమరజీవి!
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:36 AM
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్మారక భవనాన్ని నిర్మించింది.
శిథిలావస్థలో చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారకం
కమిటీ వేసినా నిధులివ్వని ప్రభుత్వాలు
రోజువారీ నిర్వహణ ఖర్చులను భరిస్తున్న ‘సభ్యులు’
సీఎం చంద్రబాబు దృష్టి సారించాలంటూ విజ్ఞప్తులు
(చెన్నై - ఆంధ్రజ్యోతి)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన ప్రదేశంలో కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్మారక భవనాన్ని నిర్మించింది. ఇప్పుడది శిథిలావస్థకు చేరుకుంది. 2015 నుంచి నిర్వహణకు కమిటీలు వేసినా నెలవారీ నిర్వహణ ఖర్చుల కోసం నిధులు ఇవ్వాలన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో దాని బాగోగులు చూస్తున్న కమిటీ సభ్యులే వారి వారి వెసులుబాటును బట్టి ఖర్చులు భరిస్తున్నారు. వాస్తవానికి 2015కు ముందు వరకూ అమరజీవి శిష్యుని కుమారుడు వైఎస్ రామకృష్ణ నేతృత్వంలోని కొంతమంది ప్రముఖులు ఈ భవనం ఆలనాపాలనా చూశారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో అప్పటివరకూ చూసిన వారు నిమ్మకుండిపోయారు. కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిర్వహణ నిధుల సంగతి మరిచింది. భవనానికి వినియోగించే విద్యుత్, నీరు, పన్నులు తదితరాలతో పాటు నిర్వహణ చూసే ఇద్దరు సిబ్బంది జీతభత్యాలు కూడా చూడాల్సి ఉంది. ఇక అమరజీవి జయంతి, వర్ధంతుల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భవన సందర్శన సమయంలో కొంత ఖర్చవుతోంది. ఈ ఖర్చులన్నింటినీ కమిటీ నిర్వాహకులే ఎవరి శక్తి మేరకు వారు వేసి చెల్లిస్తూ వచ్చారు. 2019లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేసింది. ఆ మొత్తం బకాయిల చెల్లింపునకే సరిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కమిటీలో కొన్ని మార్పులు చేసింది.
కానీ ఐదేళ్లపాటు నిధుల గురించి పట్టించుకోకుండా 2024లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రూ.4.5 లక్షలు విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఆ నగదు సభ్యుల బకాయిలకు కూడా సరిపోలేదు. మళ్లీ నాటి నుంచి నేటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. చెన్నైలో అమరజీవి భవనం ఒకటి ఉందని, అది రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి అన్న ఎరుక ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు. కొత్త కమిటీ రాకుండా రాజీనామా చేస్తే ‘స్మారకం’ అనాథ అవుతుందన్న వేదనతో అధ్యక్షుడు అనిల్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీనే కొనసాగుతోంది. అక్కడ సిబ్బందికి ఏడాదిగా జీతభత్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. భవనం కప్పు పెచ్చులూడుతోంది. గోడల్లో పలుచోట్ల పగుళ్లు వచ్చాయి. పై అంతస్తులో వున్న గ్రంథాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. వాటిని కాపాడడానికి నిర్వహణ కమిటీ చేడుతున్న చర్యలు సరిపోవడం లేదు. దీని నిర్వహణకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గతంలో రూ.5 లక్షలు ఇస్తానంటూ ప్రకటన చేశారు కానీ తర్వాత ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మరింత శోచనీయమైన అంశం ఏమిటంటే... ఈ భవనం ఏపీ ప్రభుత్వానికి చెందినదన్న విషయం కొంతమంది ఉన్నతాధికారులకీ తెలియకపోవడం. అమరజీవికి అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తానని ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... చెన్నై వైపు తన దృష్టి సారిస్తే స్మారక భవనం బాగుబాడుతుంది. అది ఠీవిగా నిలబడినంత కాలం చరిత్రను చాటిచెపుతూనే ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో ఒక శాశ్వత ప్రతిపాదన చేసి అమలు చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోట్లు అక్కర్లేదు!
ఈ భవనం నిర్వహణకు రూ.కోట్లు అవసరం లేదు. రూ.నాలుగైదు లక్షలు వ్యయం చేస్తే భవనం మరమ్మతులు పూర్తవుతాయి. ఇక్కడ అమూల్యమైన గ్రంథాలున్నాయి. సరైన ఆలనాపాలనా లేకుంటే అవి పాడైపోయే అవకాశముంది. కొంతమంది ప్రముఖులు దీని బాగోగులు చూసేందుకు ముందుకు రావాలనుకున్నా, ప్రభుత్వ నిబంధనలతో వారు దూరంగానే ఉండిపోవాల్సివస్తోంది.