Commercial Taxes Dept: ఏడు రోజుల్లో వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:27 AM
ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన ప్రభుత్వ అధికారి ఎస్. సుభాష్ చంద్రబోస్‌కు....
అమరావతిపై దుష్ప్రచారం చేసిన అధికారికి మెమో
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన ప్రభుత్వ అధికారి ఎస్. సుభాష్ చంద్రబోస్‌కు వాణిజ్యపన్నుల శాఖ గురువారం మెమో ఇచ్చింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఆంధ్రజ్యోతి’ సహా ఇతర మీడియాల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ మెమో జారీ చేసినట్టు తెలిపింది సుభాష్ వాణిజ్య పన్నుల శాఖ విభాగం తిరుపతి ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఫేస్‌బుక్‌లో 18న వివాదాస్పద పోస్టులు పెట్టడాన్ని క్రమశిక్షణారాహిత్యంగా ఆ శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఎ మెమోలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1964లోని రూల్ 3(1), 3(2), రూల్ 17ను ఉల్లంఘించినట్టు తెలిపారు. ఈ ఉల్లంఘనలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపైనా, ప్రభుత్వ కార్యక్రమాలపైనా దుష్ప్రచారం చేయడం సహజమే. కానీ, ఒక ప్రభుత్వ అధికారి వాళ్లకి వంత పాడడం క్రమశిక్షణారాహిత్యం... అందుకే ప్రభుత్వం వివరణ కోరుతూ మెమో జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.