Jagan: సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:42 AM
శాసన సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా? ఏం చేస్తారో చేయమనండి చూద్దాం. 11 ఎమ్మెల్యేలతోపాటు, నలుగురు ఎంపీలూ రాజీనామా చేసేద్దాం’ అని మాజీ సీఎం జగన్ అన్నారు.
ఆ నిబంధన ఎక్కడుందో చెప్పమనండి
ఎమ్మెల్యేలు, ఎంపీలు... అందరం రాజీనామా చేసేద్దాం
గైర్హాజరయ్యీ జీతాలు తీసుకుంటున్నామని స్పీకర్ పదేపదే అంటూ కించపరుస్తున్నారు
మీరు సభకు పోతానంటే నేను ఒద్దన్నానా..!
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలసి వెళ్లండి
ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో తేల్చుకోండి
వైసీపీఎల్పీ సమావేశంలో జగన్మోహన్‌రెడ్డి
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘శాసన సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తారా? ఏం చేస్తారో చేయమనండి చూద్దాం. 11 ఎమ్మెల్యేలతోపాటు, నలుగురు ఎంపీలూ రాజీనామా చేసేద్దాం’ అని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ నెల 18న తాడేపల్లి నివాసంలో ఆయన అధ్యక్షతన వైసీపీఎల్పీ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, శాసన సభ సమావేశాలకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తామంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదేపదే చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించారు. దానిపై వైసీపీ అధినేత స్పందించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జగన్ స్పందన ఇలా ఉంది. ‘‘శాసనసభకు సభ్యులు గైర్హాజరైతే సభ్యత్వాలు రద్దు చేయాలన్న నిబంధన ఎక్కడుంది? ‘సభకు రాకుండానే కొందరు సభ్యులు హాజరుపట్టీలో సంతకాలు చేసి జీతాలు తీసుకుంటున్నారు’ అంటూ స్పీకర్ అయ్యన్న ఎమ్మెల్యేలను కించపరచేలా పదే పదే అసెంబ్లీలోనూ, బయట మాట్లాడుతున్నారు. శాసనసభకు రాకుండానే సంతకాలు ఎందుకు చేస్తారు? గతంలో చంద్రబాబు అసెంబ్లీకి ఏడాదిన్నరపాటు గైర్హాజరైనప్పుడు జీతభత్యాలు తీసుకోలేదా? ఆరోజు అధికారపక్షానికి శాసనసభ నియమ నిబంధనలు చెప్పేవారు లేరా? చంద్రబాబు బయటకుపొతే పోనీ అనుకున్నాం.
2019కు ముందు నేను పాదయాత్రకు వెళ్లినప్పుడు ఈ చర్చ లేదు. ఎందుకని? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతానంటే పోవద్దని నేనేమైనా అన్నానా? సభలో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంలో ఉన్నాయి. వైసీపీ ఒక్కటే ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు మీకు ఎంత సమయం ఇస్తారో స్పీకర్‌ను అడగండి. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్తానంటే, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలసి వెళ్లండి. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున మీడియాతో మూడు అంశాలపై మాట్లాడేందుకు నాకు మూడు గంటలు పట్టింది. అంత సమయం మాట్లాడేందుకు అవకాశం ఇస్తానంటే అసెంబ్లీకి పోయిరండి’ అని ఎమ్మెల్యేలతో జగన్ అన్నారు.