Melioidosis Fever: అవి మెలియోయిడోసిస్ జ్వరాలే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:02 AM
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తురకపాలెం వరుస మరణాలకు మెలియోయిడోసిస్ జ్వరాలే కారణమని తెలుస్తోంది..
తుర కపాలెంలో 9 మందికి బ్యాక్టీరియా పాజిటివ్
44 రక్త నమూనాలల్లో 9 మందిలో నిర్ధారణ
ఏ బ్యాక్టీరియానో నిర్ధారించేందుకు మరింత సమయం
ప్రైవేటు వైద్యనిపుణుల సాయం కోరిన ఆరోగ్యశాఖ
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తురకపాలెం వరుస మరణాలకు మెలియోయిడోసిస్ జ్వరాలే కారణమని తెలుస్తోంది..! ఈ మరణాలకు కారణమైన బ్యాక్టీరియా ఏమిటో నిగ్గు తేల్చేందుకు ఆరోగ్య శాఖ అధికారులు తురకపాలెంలో 44 మంది జ్వర బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబోరేటరీలో పరీక్షించారు. ఈ 44 మందిలో 9 మందికి అనుమానిత బ్యాక్టీరియా పాజిటివ్‌గా వచ్చినట్టు తెలిసింది. బ్యాక్టీరియా కాలనీ గ్రోత్ మరింత పెరిగిన తర్వాతే అది ఏ బ్యాక్టీరియానో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇది బర్కోల్డేరియా సూడోమల్లీ బ్యాక్టీరియానే అని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనివల్లే ప్రమాదకరమైన మెలియోయిడోసిస్ జ్వరాలు వస్తాయన్న విషయం తెలిసిందే. గ్రామంలో నమోదైన 9 పాజిటివ్ కేసుల్లో 8 మంది మహిళలు కావడం గమనార్హం. ఇవి కాకుండా తురకపాలెంలో మరో 59 మందికి నిర్వహించిన బ్లడ్ కల్చర్ పరీక్ష ఫలితాలన్నీ సాధారణంగానే వచ్చినట్టు తెలిసింది. ఈ రిపోర్టులు శనివారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వస్తేనే తురకపాలెంలో ఇన్ఫెక్షన్‌కు దారి తీసిన కారణాలపై స్పష్టత వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇవికాక గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో శుక్రవారం తురకపాలేనికి చెందిన పి.నరసింహరావు(40) జ్వరం, కీళ్ల నొప్పులు, దగ్గు, ఆయాసంతో బాధపడుతూ ప్రైవేటు వైద్యశాలలో చేరారు. ఆయనకు నిర్వహించిన బ్లడ్‌కల్చర్ పరీక్షలో బర్కోల్డేరియా సూడోమల్లీ బ్యాక్టీరియా నిర్ధారణ అయ్యింది. ఇదే ఆస్పత్రిలో గత రెండు నెలల్లో నాలుగు మెలియోయిడోసిస్ కేసులు నమోదయ్యాయని వారంతా కోలుకున్నారని పల్మనాలజిస్ట్ డాక్టర్ కనుమూరి శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.