Mega PTM Participation: 1.29 కోట్ల మంది
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:53 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాల్లో తల్లిదండ్రులు, ఆహ్వానితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 1.29 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారు.
అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాల్లో తల్లిదండ్రులు, ఆహ్వానితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 1.29 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారు. ఇంతమంది ఒకేరోజున పేరెంట్- టీచర్స్ సమావేశాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. గిన్నిస్ రికార్డులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటారు. వారి సంఖ్య 50 లక్షలు దాటిపోవడంతో రికార్డు సాధించడం సులభమేనని సమగ్ర శిక్ష పీడీ బి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. కాగా, గురువారం రాష్ట్రవ్యాప్తంగా 60 వేల విద్యాసంస్థల్లో నిర్వహించిన మెగా పీటీఎం 2.0లో పాఠశాలల విభాగంలో 60.07 లక్షల మంది విద్యార్థులు, 43.04 లక్షల మంది తల్లిదండ్రులు, 1.89 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.64 లక్షల మంది స్కూల్ కమిటీ సభ్యులు, 66,179 మంది పూర్వ విద్యార్థులు, 58,651 మంది దాతలు, 70,578 మంది ప్రజాప్రతినిధులు, 60,356 మంది ఉద్యోగులు, అధికారులు, 1.29 లక్షల మంది ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు. ఇక జూనియర్ కాలేజీల్లో 8.39 లక్షల మంది విద్యార్థులు, 5.8 లక్షల మంది తల్లిదండ్రులు, 8,608 మంది జూనియర్ లెక్చరర్లు హాజరయ్యారు. మొత్తంగా 1,28,79,081 మంది పాల్గొన్నట్లు వెల్లడైంది. ఇంకా కొన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కావాల్సి ఉంది. ఇకనుంచి ప్రతి విద్యా సంవత్సరంలో రెండుసార్లు మెగా పీటీఎం నిర్వహిస్తారు.