Parent Teacher Meeting: పండగలా పీటీఎం
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:05 AM
మెగా పీటీఎం సమావేశాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పండుగ వాతావరణంలో జరిగాయి.
పార్వతీపురంలో చంద్రబాబు.. చిలకలూరిపేటలో పవన్
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మెగా పీటీఎం సమావేశాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పండుగ వాతావరణంలో జరిగాయి. 45,047 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో జరిగిన తల్లిదండ్రులు-టీచర్ల సమావుశాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు సహా మొత్తం సుమారు 74 లక్షల మంది పాల్గొన్నారని సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, విద్యార్థుల అసె్‌సమెంట్ పుస్తకాలు చూపించి వారి సామర్థ్యాలను తెలియజేశారు. అలాగే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రధాన లక్ష్యంగా మెగా పీటీఎం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని మోడల్ స్కూల్‌లో సీఎం, లోకేశ్... పల్నాడు జిల్లా చిలకలూరిపేట శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇతర జిల్లాల్లో మంత్రులు పాల్గొన్నారు. బోధనలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘క్లిక్కర్’ను ముఖ్యమంత్రి భామిని స్కూలులో ప్రారంభించారు.