Mega Liquor Scam:మూలం ఆ ముగ్గురే
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:35 AM
ఆ ముగ్గురే మద్యం ముడుపుల రూటింగ్ చేశారు. బినామీ, కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమాస్తులు పోగేసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు సూచన మేరకు మద్యం ఆర్డర్ల వివరాలు ధ్వంసం చేశారు...
చార్జిషీట్‌లో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్ప పేర్లు
ఏసీబీ కోర్టుకు రెండో అభియోగపత్రం
మద్యం నోట్‌ఫైల్స్ సైతం ధ్వంసం
సరఫరా ఆర్డర్ల వివరాలు మాయం
ఐపీఎస్ పీఎస్ఆర్ సూచనతోనే ఫైళ్లు నాశనం
దీనిపై చర్యలకు యత్నించిన రజత్ భార్గవపై ఒత్తిడి
చార్జిషీట్‌లో ఆయన వాంగ్మూలాన్నీ జతచేసిన సిట్
లిక్కర్ ముడుపులతో భారీగా భూములు.. ఆస్తులు
ఎక్కడెక్కడ ఏం కొన్నదీ పక్కా ఆధారాలతో నిర్ధారణ
అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆ ముగ్గురే మద్యం ముడుపుల రూటింగ్ చేశారు. బినామీ, కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమాస్తులు పోగేసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ పీఎ్‌సఆర్ ఆంజనేయులు సూచన మేరకు మద్యం ఆర్డర్ల వివరాలు ధ్వంసం చేశారు’’ అని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోర్టుకు వివరించినట్టు తెలిసింది. జగన్ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల మద్యం స్కామ్‌పై ‘సిట్’ ఇప్పటికే ఒక చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా సోమవారం మరో చార్జిషీటును కోర్టుకు సమర్పించింది. ఇందులో... ముగ్గురు నిందితుల పాత్రను వివరించినట్లు తెలిసింది. మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్‌డీ కృష్ణ మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప... ఈ ముగ్గురూ ముడుపులు భారీగా తీసుకుని బినామీలు, కుటుంబ సభ్యుల పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు స్పష్టంగా పేర్కొన్నట్టు సమాచారం. మద్యం ఆర్డర్లకు సంబంధించిన ఓఎఫ్ఎస్ ఆధారాలను వడ్డేశ్వరంలో(తాడేపల్లి దగ్గర్లో) ధ్వంసం చేశారని వెల్లడించింది. 2023 నవంబరు 2న సమావేశమై ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సూచన, సిఫారసు మేరకు ధ్వంసం చేసినట్లు కోర్టుకు తెలిపినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లిక్కర్ స్కామ్ కేసులో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి, సత్యప్రసాద్, పీఎస్ఆర్ ఆంజనేయులు, వాసుదేవ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి పలుమార్లు సచివాలయంలో, తాడేపల్లిలో సమావేశమైనట్లు ఆయా లొకేషన్లను ‘సిట్’ సాంకేతిక ఆధారాలతో గుర్తించింది. ఆ వివరాలను చార్జిషీటులో పొందుపరిచింది. లిక్కర్ కుంభకోణంతోసంబంధం ఉన్న వ్యక్తులతో పీఎస్ఆర్ ఆంజనేయులు 65సార్లు మాట్లాడినట్లు నిరూపించే కాల్ డేటాను సేకరించింది. నిందితుల నెంబర్లు, మాట్లాడిన సమయం, తేదీతో సహా వివరించింది. దీపికా బార్ అండ్ రెస్టారెంట్ సెల్ టవర్ పరిధిలో వీరందరి నంబర్లను ట్రేస్ చేసింది. అక్కడ పలుమార్లు గంటల కొద్ది లంచ్ నుంచి డిన్నర్ దాకా సమావేశమైనట్లు కోర్టుకు ఆధారాలు అందజేసింది. వీరి మధ్య నడిచిన ఫోన్‌కాల్స్‌తో పాటు వాట్సాప్ సందేశాలు,ఇతర రికార్డులూ సమర్పించింది.
చర్యలు వద్దంటూ రజత్ భార్గవపై ఒత్తిడి..
రజత్ భార్గవ, వివేక్ యాదవ్‌తోపాటు ఓఎస్‌డీ నాగేశ్వరరావు, వాసుదేవ రెడ్డి 2024 ఫిబ్రవరి 20న సచివాలయంలో సమావేశమయ్యారు. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉంచొద్దని ఆ సమావేశంలో పీఎస్ఆర్ ఆంజనేయులు వారిని అప్రమత్తం చేశారు. అడ్డగోలుగా ఓఎ్‌ఫఎస్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు రజత్ భార్గవ మెమోలు ఇవ్వగా, బాధ్యులపై చర్య తీసుకోవద్దంటూ ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు సిట్ వివరించింది. 2023లో పాత ఓఎఫ్ఎస్‌లు అన్నీ తీసుకొచ్చి ఆ తేదీలతో సంతకాలు చేయాలని తనపై ఒత్తిడి చేయగా, తాను తిరస్కరించానంటూ రజత్ భార్గవ ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ చార్జిషీట్‌కు జత చేసింది.
ఆస్తులు పోగేశారు..
జగన్‌తో నిరంతరం ఉండే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్స్‌లో శాశ్వత డైరెక్టర్ జగన్ భార్య భారతికి నమ్మిన బంటు బాలాజీ గోవిందప్ప లిక్కర్ ముడుపుల సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ.. అందులో తాము గుర్తించిన కొన్నింటిని సిట్ వివరించింది. కృష్ణమోహన్ రెడ్డి బాన్స్‌వాడలో భార్య చెల్లెలు లక్ష్మీ నిహారిక పేరుతో ఆస్తులు కొన్నారు. కుమారుడు రోహిత్ రెడ్డి పేరుతో నెల్లూరు జిల్లా కోవూరులో ఆస్తులు కొనుగోలు చేశారు. బాలాజీ గోవిందప్ప నైమిషా ఇన్ ఫ్రా ఎల్‌ఎల్‌పీ పేరుతో 2021లో ఆస్తులు కొన్నారు. భార్య ప్రియా బాలాజీ పేరుతోనూ ఆస్తులు ఉన్నాయని సిట్ తెలిపింది. ఇందుకు సాక్ష్యంగా వారి ఆస్తులకు బినామీ అయిన గన్నాబత్తుల వరప్రసాద్(40శాతం) వాంగ్మూలాన్ని కోర్టుకు చూపించింది. ముడుపుల డబ్బు మొత్తం ఎస్‌ఎస్ ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్లోనే గోవిందప్ప తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అలా తీసుకున్న సొమ్ములో నుంచి మూడుకోట్ల రూపాయలతో కుమారుడు సంజయ్ బాలాజీ, కుమార్తె నికిత బాలాజీ పేర్లతో ఆస్తులు కొన్నట్లు తెలిపింది. భార్య పేరుతో గండిపేట, నార్సింగిలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆధారాలు సమర్పించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 2019 జూన్ నుంచి 2024 మే వరకూ అత్యంత కీలకంగా కె. ధనుంజయ్ రెడ్డి వ్యవహరించారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం పాలసీ రూపకల్పన నుంచి రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన ముడుపులు అంతిమ లబ్ధిదారుకు చేర్చే వరకూ ఆయన ఏమేమి చేశారనేది చార్జిషీట్‌లో వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్, తాడేపల్లిలో లిక్కర్ సిండికేట్ నుంచి తీసుకున్న ముడుపుల సొమ్ములో తన వాటా సొమ్మును బినామీల పేర్లతో ఎక్కడెక్కడ ధనుంజయ్‌రెడ్డి పెట్టుబడులు పెట్టారో ఆధారాలతో వివరించినట్లు తెలిసింది. ఇక.. ఏ1 రాజ్ కసిరెడ్డి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పరిసరాల్లో 30.25ఎకరాల 11ఆస్తులు కొనుగోలు చేశారు. వీటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. రాజ్ కసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి డిస్టిలరీస్ తరపున ఆర్థిక లావాదేవీలు జరిపారు. 2019 అక్టోబరు 13న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయ సాయురెడ్డి, రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ సమావేశం అయ్యారు. అప్పటి సీఎస్ సిఫారసులు దిక్కరించి సత్యప్రసాద్, వాసుదేవ రెడ్డిని దోపిడీకి అనుగుణంగా నియమించిన విషయాన్ని సైతం సిట్ ప్రస్తావించింది. కాగా, వైసీపీ మద్యం కుంభకోణం కేసులో మొత్తం 48మంది నిందితులు కాగా పది మంది వ్యక్తులు, తొమ్మిది సంస్థల పాత్రపై రెండు చార్జిషీట్లలో సిట్ కోర్టుకు వివరించింది. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సహా ఇప్పటికే 12మంది అరెస్టై జైల్లో ఉన్నారు.