AP CM Chandrababu: మెగా ప్రోత్సాహం
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:18 AM
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు పెడితే, వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తాం.
పెట్టుబడి రూ.200 కోట్లు దాటితే మెగా హోదా
సరైన సమయం... సద్వినియోగం చేసుకోండి
ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా గ్లోబల్ హబ్‌గా ఏపీ
వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యం
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకం
ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు
‘ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ‘‘ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు పెడితే, వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. మరిన్ని ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం. ఇదే సరైన సమయం. పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు తరలి రండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు గ్లోబల్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ‘భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి’ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం ‘ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్’ సదస్సును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ఆయా రంగాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సాధిస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2030 నాటికి భారత్‌లో 700 ట్రిలియన్ డాలర్ల టర్నోవర్ జరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. దీనికోసం మరింత వేగంగా అడుగులు వేయాల్సి అవసరం ఉందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో రాష్ట్ర వాటా ప్రస్తుతం 9శాతంగా ఉందని, జీఎస్డీపీలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల వాటా 35 శాతంతో రూ.5.19 లక్షల కోట్లుగా ఉందని వివరించారు. త్వరలో ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం అవతరించబోతుందన్నారు. అలాగే 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు చేస్తున్న రాష్ట్రం.. దేశానికి ఆక్వా హబ్‌గా మారనుందని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది సమగ్ర ఆహార పార్కులు, 17 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న కోల్డ్ స్టోరేజీలు, 33 లక్షల టన్నుల సరుకు నిల్వచేసేందుకు గోదాములు ఉన్నాయన్నారు.
ఫుడ్, బెవరేజ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా 175నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర, విశాఖ జిల్లాల్లో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకో, కాఫీ క్లస్టర్లు ఉన్నాయన్నారు.
ఇదే సరైన సమయం
గత ఏడాది రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలితో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉంటున్నాయని తెలిపారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)ను కూడా ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయన్నారు. ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక వేత్త’ కార్యక్రమాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీ అతిపెద్ద ఎగుమతి దారు!
ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. పండ్లు, ఆక్వా రంగాల్లో ఏపీ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. దేశ ఎగుమతుల్లోనూ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉద్యాన, ఆక్వా, ఫుడ్‌ప్రాసెసింగ్, బెవరేజెస్ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుమతులను కూడా వేగంగా ఇస్తామని హామీ ఇచ్చారు. భారత వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్ మోహిత్ సింగ్లా మాట్లాడుతూ.. అమరావతిలో టీపీసీఐ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సదస్సులో ఏపీలో ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ చేసిన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, తదితర అంశాలపై పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పరిశోధకుల మధ్య విస్తృత చర్చ జరిగింది. నష్టాల నివారణ, స్మార్ట్ కోల్డ్ చైన్, లాజిస్టిక్స్ సదుపాయాలు, డెయిరీ, పౌల్ట్రీ, మాంసం ప్రాసెసింగ్ వంటి అంశాలపైనా చర్చించారు.
‘గ్రిఫిన్ నెట్‌వర్క్’ సదస్సుకు సీఎం
ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలు సభ్యులుగా ఉన్న ‘గ్రిఫిన్ నెట్‌వర్క్’ సదస్సు శుక్రవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగింది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. సదస్సుకు సుమారు 25 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. స్టార్ట్‌పలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీల సీఈవోలతో ఈ సదస్సు నిర్వహించారు.