Share News

Minister Lokesh: కొప్పర్తికి లక్ష ఉద్యోగాలు

ABN , Publish Date - Sep 03 , 2025 | 04:37 AM

కొప్పర్తి మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అక్కడకు పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి వెల్లడించారు.

Minister Lokesh: కొప్పర్తికి లక్ష ఉద్యోగాలు

  • అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే

  • మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి

  • మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం

  • కడప జిల్లా చింతకొమ్మదిన్నె స్కూల్‌లో

  • తొలి స్మార్ట్‌ కిచెన్‌ ప్రారంభించిన లోకేశ్‌

  • మరో 4 వర్చువల్‌గా ప్రారంభం

  • టీవీల తయారీ, రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమలను ప్రారంభించిన మంత్రి

సీకేదిన్నె, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొప్పర్తి మెగా ఇండస్ర్టియల్‌ హబ్‌లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అక్కడకు పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి వెల్లడించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్లతో నెలకొల్పిన స్మార్ట్‌ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. విద్యార్థుల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కిచెన్‌ను ఏర్పాటుచేయడం దేశంలోనే తొలిసారి అని తెలిపారు. అనంతరం ఈ జిల్లాలో మరో నాలుగు స్మార్ట్‌ కిచెన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక్కడ విజయవంతం అయితే, రాష్ట్రమంతా సెంట్రలైజ్డ్‌ స్మార్ట్‌కిచెన్లను విస్తరిస్తామని తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ను వాడి ఆధునిక పద్ధతుల్లో ఇక్కడ వంటలు తయారుచేసి చుట్టుపక్కల 136 స్కూళ్లకు ప్రత్యేక వాహనాల్లో పంపించనున్నారు. వంట కోసం ఆర్వోప్లాంట్‌ నీటిని వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం 10వ తరగతి విద్యార్థినులతో మంత్రి భేటీ అయ్యారు. చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో నూతనంగా ఏర్పాటు అయిన ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ భవనాన్ని మంత్రి లోకేశ్‌ ప్రారంభించారు. టీవీలను తయారుచేసే ఎంఎస్‌ టెక్నోడోమ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను, రెడీమెడ్‌ దుస్తులు తయారుచేసే టెక్సాసానా వరల్డ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమలను కొప్పర్తి మెగా ఇండ్రస్ట్రియల్‌ హబ్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డితో కలిసి ఆరంభించారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడే అక్కడే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. అనంతరం మహిళలతో కలిసి సెల్ఫీ దిగారు. పరిశ్రమ లోపల తిరిగి ఎల్‌ఈడీ టీవీల తయారీని పరిశీలించారు.


కార్యకర్తలకు అండగా ఉంటాం: లోకేశ్‌

కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. సీకేదిన్నె మండలం కొలుములపల్లెలో 69వ ప్రజాదర్బార్‌ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రజలు, కార్యకర్తల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు.


  • థ్యాంక్స్‌ సార్‌ పుస్తకాల బరువు తగ్గించారు

  • లోకేశ్‌తో భేటీలో విద్యార్థుల సంతోషం

ప్రభుత్వం చేపట్టిన విద్యాసంస్కరణలతో కలుగుతున్న మంచి గురించి మంత్రి లోకేశ్‌ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘‘సెమిస్టర్‌వైజ్‌ టెస్ట్‌బుక్‌ విధానం మాకు ఉపయోగకరంగా ఉంది. దాని నివల్ల పుస్తకాల బరువు తగ్గింది. సోషల్‌ స్టడీ్‌సలోని నాలుగు టెక్ట్స్‌ బుక్‌లను రెండిటికి కుదించాలి. ఇంగ్లీష్‌ టెస్ట్‌బుక్‌, సప్లిమెంటరీ కలిపి ఒకటిగా ఇస్తే బాగుంటుంది. సన్నబియ్యం ఇస్తుండడం వలన మధ్యాహ్న భోజనం గతం కంటే బాగుంది. బుక్‌లెట్స్‌ బాగున్నాయి.’’ అని పేర్కొన్నారు. వారి సూచనలను మంత్రి సానుకూలంగా ఆలకించారు. అనంతరం పెండ్లిమర్రి మండల పరిధిలోని చెర్లోపల్లె పంచాయతీలో రూ.12కోట్లతో నిర్మించిన అధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను లోకేశ్‌ ప్రారంభించారు. పీఎం ఉష పథకంలో భాగంగా యోగివేమన వర్శిటీలో రూ.20 కోట్లతో నిర్మించనున్న ఆడిటోరియం, నూతన పరిపాలన భవనానికి శంకుప్థాపన చేశారు.

Updated Date - Sep 03 , 2025 | 04:40 AM