Share News

Nara Lokesh: ఇకపై ఏటా డీఎస్సీ

ABN , Publish Date - Aug 23 , 2025 | 06:13 AM

రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh: ఇకపై ఏటా డీఎస్సీ

  • 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ విజయవంతం

  • విద్యాశాఖపై సమీక్షలో మంత్రి లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అనవసరమైన శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృథా చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యా రంగంలో ప్రమాణాల మెరుగుదలకు 14 నెలలుగా అనేక సంస్కరణలు అమలుచేశామన్నారు. ఈ సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలు సాధించడమేనని చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించాల్సిన బాధ్యత అధికారులు, టీచర్లపై ఉందన్నారు. అసర్‌ నివేదిక ప్రకారం ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌).. అంటే చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యం సాధించడంలో రాష్ట్రం 14వ స్థానంలో ఉందని, ఈ ర్యాంకును మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో తొలిసారిగా ప్రతి బిడ్డకూ ఎఫ్‌ఎల్‌ఎన్‌ను ఒక హక్కుగా అందిచబోతున్నామన్నారు. తల్లికి వందనం పథకంలో చివరి విడతగా పెండింగ్‌ దరఖాస్తులకు రూ.325 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా మంజూరైన జవహర్‌ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. తమిళనాడు, పంజాబ్‌, గుజరాత్‌ల్లో అమలుచేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి ఉత్తమ ప్రీస్కూల్‌ పాలసీ రూపొందించాలని సూచించారు. శాప్‌ సహకారంతో సైన్స్‌, స్పోర్ట్స్‌ ఫెయిర్‌లు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలన్నారు. ఆసక్తిగలవారు వారి గ్రామాల్లోని పాఠశాలలను దత్తత తీసుకునేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించాలన్నారు.


అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఆధునీకరించిన సైన్స్‌ కేంద్రాలను త్వరగా ప్రారంభించాలన్నారు. అమరావతిలో ఏర్పాటుచేసే సెంట్రల్‌ లైబ్రరీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్నారు. 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ఈ లైబ్రరీ నిర్మాణం ఏడాదిలో పూర్తిచేయాలన్నారు. విశాఖపట్నంలో ప్రతిపాదించిన ప్రాంతీయ లైబ్రరీ 50వేల అడుగుల్లో ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను అనుసంధానిస్తూ వెబ్‌సైట్‌ రూపొందించాలన్నారు. స్థానిక సంస్థల నుంచి రూ.213 కోట్ల సెస్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని లైబ్రరీల అభివృద్ధికి వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ లైబ్రరీల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలతో సన్నద్ధమైన 350 మందికి కానిస్టేబుల్‌ ఉద్యోగాలు వచ్చాయన్నారు. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలను లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలన్నారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు మంత్రి అనుమతి మంజూరు చేశారు. అక్షరాంధ్రలో భాగంగా 16లక్షల మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. సమీక్షలో ఉన్నతాధికారులు కోన శశిధర్‌, వి.విజయరామరాజు, కృతిక శుక్లా, బి.శ్రీనివాసరావు, దీవెన్‌రెడ్డి, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

రోల్‌ మోడల్‌గా నైపుణ్యం పోర్టల్‌

యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా ఉండాలని మంత్రి ఆదేశించారు. శుక్రవారం నైపుణ్య శా ఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్టోబరులో నైపు ణ్యం పోర్టల్‌ ప్రారంభించాలన్నారు. పీఎం ఇం టర్న్‌షిప్‌ స్కీంతో నైపుణ్యం పోర్టల్‌ను అనుసంధానించాలన్నారు. దేశంలో ఎక్కడా నైపు ణ్యం పోర్టల్‌ను ఈస్థాయిలో అభివృద్ధి చేయలేదన్నారు. ఏడాదికి 50వేల మందికి శిక్షణ ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటికే 36 రంగాల్లో 3వేలకు పైగా జాబ్‌ కేటగిరీలను పోర్టల్‌లో నమోదుచేశామన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 06:14 AM