Mega DSC : సార్లొచ్చారు
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:30 AM
ప్రభుత్వ ఉద్యోగం అనేది ఓ కల. టీచర్ ఉద్యోగం సాధించడమనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాశయం. అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది.
16,347 మంది జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద డీఎస్సీ
నాలుగు నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి
నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు
రేపటినుంచి జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన
ఒక్క పోస్టూ భర్తీ చేయకుండా జగన్ వంచన
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం అనేది ఓ కల. టీచర్ ఉద్యోగం సాధించడమనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాశయం. అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. విభజిత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి 16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎలాంటి న్యాయ వివాదాలకూ తావులేకుండా పరీక్షలు, ఫలితాల ప్రక్రియను పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం ఆదివారం మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందిస్తోంది. గత డీఎస్సీలు అంటే వివాదాలే గుర్తుకొస్తాయి. నోటిఫికేషన్లు జారీ అయినా రకరకాల వివాదాలతో అడుగడుగునా బ్రేకులు పడేవి. ఇక ఆ ప్రక్రియ ఎంతకాలానికి పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టేది కాదు. అలాంటి ఒకేసారి 16,347 పోస్టులు ప్రకటించిన డీఎస్సీని ప్రభుత్వం రికార్డు సమయంలో పూర్తిచేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు మొత్తం 67 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో నిర్వహించింది. టెట్ మార్కుల్లోనూ వివాదాలకు అవకాశం లేకుండా అనేకసార్లు అప్‌డేషన్‌కు అవకాశం కల్పించింది. ఎంపికైనవారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించినా, అభ్యర్థుల్లో అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో శుక్రవారం రాత్రి మెరిట్ జాబితాలు ప్రకటించింది. ఆదివారం అభ్యర్థులకు కాల్ లెటర్లు అందించనుంది. ఈ మొత్తం ప్రక్రియకు 125 రోజులు మాత్రమే పట్టింది. మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ కూడా పూర్తికానుంది.
ఏడేళ్ల తర్వాత మెగా డీఎస్సీ
ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి ఎక్కువ టీచర్ ఉద్యోగాలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఆ సంఖ్య పరిమితమైంది. 2014లో టీడీపీ ప్రభుత్వం 9,061 పోస్టులతో డీఎస్సీ ప్రకటించి పూర్తిచేసింది. మళ్లీ 2018లో 7,729 పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా ఆ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో ఖాళీలు పెరిగిపోయాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత విడుదల చేసిన మెగా డీఎస్సీ కావడంతో అభ్యర్థులు పెద్దఎత్తున పోటీపడ్డారు. ఇంత పెద్ద డీఎస్సీ ఇప్పట్లో ఉండదనే ఆలోచనతో లక్షల మంది పరీక్షలు రాశారు.
నాడు పోస్టుల హేతుబద్ధీకరణతో మోసం
నిరుద్యోగులను అందులోనూ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారిని గత వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. రాష్ట్రంలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీచేస్తానని 2019కు ముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ పదేపదే ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక జీవో 117 తీసుకొచ్చి పోస్టుల హేతుబద్ధీకరణ చేశారు. టీచర్ ఉద్యోగాలు ఖాళీలే లేవనే కొత్త వాదన తెరపైకి తెచ్చారు. నిరుద్యోగుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించింది. అది కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుని ఆదిలోనే ఆగిపోయింది. ఆ వెంటనే ఎన్నికలు రావడంతో మొత్తం ప్రక్రియకు బ్రేక్ పడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని రద్దుచేసి జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చింది. కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలలు ప్రవేశపెట్టి తరగతికి ఒక టీచర్‌ను ఇచ్చింది. ఏకోపాధ్యాయ పాఠశాలలను 13 వేల నుంచి 9,600కు తగ్గించింది. ఈ చర్యల ఫలితంగా వచ్చిన ఖాళీలతో మెగా డీఎస్సీ ప్రకటించి ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది.
ఒక్కో పోస్టుకు ఒక్కరికే పిలుపు
డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఆదివారం కాల్ లెటర్లు అందనున్నాయి. ఏపీడీఎస్సీ వెబ్‌సైట్ అభ్యర్థుల లాగిన్‌లలో పాఠశాల విద్యాశాఖ వీటిని అందుబాటులో ఉంచనుంది. ఒక పోస్టుకు ఒకరు చొప్పున మొత్తం 16,347పోస్టులకు గాను అంతమందినే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల్లో ప్రారంభమవుతుంది. ప్రతి 50మంది అభ్యర్థులకు ఒక బృందాన్ని కేటాయించారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఎవరైనా హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా ఆ స్థానాలను ఖాళీగా చూపించి, వాటి భర్తీ కోసం మెరిట్ జాబితాలో తర్వాత నిలిచిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
ఆటోడ్రైవర్ కుమార్తె అద్భుతం
మూడు కేటగిరీల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
విశాఖ నగర పరిధిలోని చినముషిడివాడకు చెందిన బోకం అనిత మూడు కేటగిరీలలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకులు సాధించారు. స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 89.71 మార్కులు, టీజీటీ బయాలజీలో 84.95 మార్కులు, సైన్స్‌లో 77.9 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. అనిత భర్త గేదెల స్వామినాయుడు రైల్వేలో ట్రాక్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. వీరికి మూడున్నరేళ్ల బాబు ఉన్నాడు. అనిత తండ్రి సత్యం ఆటో డ్రైవర్. మొదటి నుంచీ కుమార్తెను చదువులో ప్రోత్సహించారు. సోదరుడు మహేశ్ మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. వారందరి సహకారంతోనే మూడు ర్యాంకులు సాధించానని అనిత అన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో చేరనున్నట్టు తెలిపారు.
కూలీ బిడ్డ తడాఖా
ఐదు పోస్టులకు అర్హత
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద గ్రామం ఓఎస్ గొల్లపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ వెంకటరమణ కుమారుడు శేషాద్రి ఐదు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్, సెకండరీ గ్రేడ్ పోస్టు, టీజీటీ తెలుగు, టీజీటీ సోషల్, ఎస్‌ఏ తెలుగు పోస్టులకు అర్హత సాధించారు.