Share News

Mega DSC 2025: మెగా డీఎస్సీ.. మెగా హిట్‌

ABN , Publish Date - Sep 26 , 2025 | 04:20 AM

మెగా డీఎస్సీ మెగా హిట్‌ అయింది. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసిన 15,941 మంది కల నెరవేరింది. గురువారం అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు..

Mega DSC 2025: మెగా డీఎస్సీ.. మెగా హిట్‌

  • 15,941 మందికి నియామక పత్రాలు అందజేత

  • అమరావతిలో వైవిధ్యంగా సభా వేదిక

  • నాలుగు వైపులా తిరిగేలా ర్యాంప్‌ ఏర్పాటు

  • జిల్లాల వారీగా టీచర్లకు గ్యాలరీలు

  • అందరినీ పలకరించిన సీఎం, లోకేశ్‌, మాధవ్‌

  • టీచర్ల ప్రశ్నలకు నాయకుల సమాధానాలు

  • నా టీచర్‌ను ఇప్పటికీ మర్చిపోలేదన్న బాబు

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ మెగా హిట్‌ అయింది. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూసిన 15,941 మంది కల నెరవేరింది. గురువారం అమరావతిలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు, అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందడంతో వారి ఆనందం రెట్టింపైంది. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన కొత్త టీచర్లు ఎంతో ఉత్సాహంతో నియామక పత్రాలు అందుకున్నారు. పాఠశాల విద్యాశాఖ ఈ సభను నిర్వహించిన తీరు కూడా జోష్‌ పెంచింది. రొటీన్‌కు భిన్నంగా ప్లస్‌ ఆకారంలో సభా ప్రాంగణం మధ్యలో వేదిక ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి నాలుగు వైపులా ప్రాంగణం చివరి వరకూ నడిచేలా ర్యాంపులు నిర్మించారు. సభలోకి అడుగుపెట్టగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ టీచర్ల మధ్యలో నుంచే నడుచుకుంటూ సభ నలువైపులా తిరిగి అందరినీ పలకరించారు. అందరితో కరచాలనం చేస్తూ తిరగడానికే అరగంట సమయం పట్టింది. అనంతరం వేదికపై కూడా ఈ ముగ్గురే ఉన్నారు. వారు కూర్చున్న సీట్లు అన్నివైపులా తిరిగేలా ఏర్పాటుచేయడంతో అన్ని వైపులా ఉన్నవారిని చూస్తూ ప్రసంగించారు. మరోవైపు జిల్లాల వారీగా టీచర్లకు గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు ఆ గ్యాలరీల్లోనే కూర్చున్నారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లోనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 15,941 మంది కొత్త టీచర్లు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిపి 34 వేల మందితో భారీఎత్తున సభ జరిగింది.


ఆకట్టుకున్న సక్సెస్‌ స్టోరీలు

మొత్తం 22మంది టీచర్లకు సీఎం, లోకేశ్‌, మాధవ్‌ నియామక పత్రాలు అందజేశారు. వారిలో 16 మంది వివిధ సబ్జెక్టుల్లో టాపర్లు. మరో ఆరుగురు అనేక కష్టాలను అధిగమించి ఉద్యోగాలు సాధించినవారు. వారి సక్సెస్‌ స్టోరీలను పాఠశాల విద్యాశాఖ వీడియోల రూపంలో ప్రదర్శించింది. స్కూల్‌ అసిస్టెంట్‌- సోషల్‌ ఉద్యోగం సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మణరావు, అల్లూరి జిల్లాకు చెందిన నాగవిజయ, క్రీడా కోటాలో ఉద్యోగం పొందిన జీవనజ్యోతి, పోలియో బాధితుడైనా 42ఏళ్ల వయసులో టీచర్‌ ఉద్యోగం సాధించిన రామారావు, వ్యవసాయం చేసుకుంటూ టీచర్‌ అయిన కళ్యాణదుర్గానికి చెందిన ఎం.నవీన్‌, కడప జిల్లాలో ఉర్దూ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం సాధించిన షేక్‌ ముంతరీన్‌ వీడియోలు ఆకట్టుకున్నాయి.

అధికారులకు ప్రత్యేక అభినందన

మెగా డీఎస్సీ ప్రక్రియలో కీలకంగా వ్యవహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, డైరెక్టర్‌ వి.విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు, మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకటరమణను లోకేశ్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఇంత పెద్ద టాస్క్‌ను వారు కష్టపడి ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు.


ప్రశ్నలు- సమాధానాలు

తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే ఎందుకు పెట్టారు?

- ఆర్‌. ప్రవీణ, చిత్తూరు జిల్లా

చంద్రబాబు: మిమ్మల్ని చూస్తుంటే మీకంటే నాకే ఎక్కువ ఆనందంగా ఉంది. నేను సీఎం అయిన తొలిసారి నుంచీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాను. సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోలో భాగంగానే మెగా డీఎస్సీని మెగా హిట్‌ చేశాం. గత ప్రభుత్వం ఒక్క టీచర్‌ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి 150 రోజుల్లోనే పూర్తిచేసిన లోకేశ్‌, అధికారులను అభినందిస్తున్నా. నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన భక్తవత్సలం టీచర్‌ ఇప్పటికీ గుర్తే. అలా గుర్తుంచుకునేది గురువులనే.

మా నాన్న కూడా టీచర్‌. ఇప్పుడు నేనూ అయ్యాను. మీ జీవితంలో బాగా గుర్తుంచుకున్న టీచర్‌ ఎవరు?

- జంధ్యాల అంజలి, ప్రకాశం జిల్లా

చంద్రబాబు: నేను ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఎకనమిక్స్‌లో ఎంఏ చేశాను. తర్వాత ఏం కావాలి అని అప్పట్లో ఆలోచిస్తూ ఉండేవాడిని. రకరకాల ఆలోచనల తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ప్రొఫెసర్‌ డీఎల్‌ నారాయణ. ఆ తర్వాత ఎమ్మెల్యేను, మంత్రిని, ముఖ్యమంత్రినయ్యా. ఒక్కోసారి ప్రోత్సాహం అనేది గొప్ప మార్పునకు దారితీస్తుంది.

రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు ప్రణాళిక ఏంటి?

- సుమన్‌ నలుకుర్తి, గుంటూరు

లోకేశ్‌: యువగళం పాదయాత్రలో గంగాధర నెల్లూరులో ఓ గ్రామానికి వెళ్లాను. అక్కడ ఒక తల్లిని ‘మా ప్రభుత్వం వచ్చాక మీకేం చేయాలి?’ అని అడిగా. అప్పుడా తల్లి... ‘నా భర్త చనిపోయాడు, పిల్లల్ని కష్టపడి చదివించా. వారికి ఉద్యోగాలివ్వండి’ అని అడిగింది. ఆరోజే ఉద్యోగాల కల్పనపై నిర్ణయం తీసుకున్నా. 20లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చా. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. తద్వారా 10 లక్షల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.


జెండర్‌ ఈక్వాలిటీకి ఏం చర్యలు తీసుకుంటున్నారు?

- బోకం అనిత, విశాఖపట్నం

లోకేశ్‌: సమాజంలో మార్పు రావాలంటే ముందు మన ఇంట్లో రావాలి. మా ఇంట్లో తాత, చంద్రబాబుగారి నుంచి మహిళలను గౌరవించడం నేర్చుకున్నా. విద్యా మంత్రినయ్యాక పాఠ్యాంశాల్లో మార్పులు చేశాం. పాఠ్య పుస్తకాల్లో మహిళలు మాత్రమే ఇంటి పనులు చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు తీసేశాం. ఇంటి పనులు పురుషులు కూడా చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు జెండర్‌ సెన్సిటివిటీ తరగతులు తేవాలి. నాలుగేళ్లలో జెండర్‌ సెన్సిటివిటీ తరగతులు బోధిస్తాం. సినిమాలు, టీవీ షోల్లోనూ మహిళలను అగౌరవపర్చే డైలాగులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నా.

మీ జీవితంపై టీచర్‌ ప్రభావం ఎలా ఉంది?

- తేజసాయి, తూర్పుగోదావరి జిల్లా

పీవీఎన్‌ మాధవ్‌: నేను గుడిలోవలో చదువుకున్నాను. మా ప్రిన్సిపాల్‌ను చూసి చాలా నేర్చుకున్నాను. ఆయనలో అహంకారం కనిపించేది కాదు. మాతో కలిసి భోజనం చేసేవారు. చిన్న విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపితే గొప్ప విషయాలు సాధించలేం అనేది ఆయన నుంచే నేర్చుకున్నా. మన అందరి దిశ మార్చేది టీచరే.

Updated Date - Sep 26 , 2025 | 04:24 AM