Teacher Appointment: 19న మెగా డీఎస్సీ సభ!
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:56 AM
మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులతో భారీఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది...
ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు
సచివాలయ సమీపంలో నిర్వహణకు కసరత్తు
ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు
దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సెలింగ్
బడుల పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులతో భారీఎత్తున సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున 19న సభ నిర్వహించాలని యోచిస్తోంది. ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాల సమయంలో, అది కూడా సచివాలయానికి సమీపంలోనే సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన డీఎస్సీ జాబితాలు 15న విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాగా 18 మంది అభ్యర్థుల పరిశీలన మంగళవారం చేపట్టారు. ఉద్యోగాలకు అర్హులుగా భావిస్తున్న వారి జాబితాలను మరోసారి పరిశీలిస్తున్నారు. అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీలను మంగళగిరిలోని విద్యాభవన్‌కు తీసుకొచ్చి సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభించారు. రెండు రోజుల్లో ఈ పరిశీలన పూర్తయిన తర్వాత జాబితాలను జిల్లాలకు పంపి డీఎస్సీ కమిటీలతో సంతకాలు చేయిస్తారు. అనంతరం 15న తుది జాబితాలు ప్రకటిస్తారు. అమరావతిలో నిర్వహించే సభలో అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తారు. దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారు. సెలవుల అనంతరం బడుల పునఃప్రారంభం రోజున కొత్త టీచర్లు పాఠశాలల్లో ఉండాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.