Mega DSC 2025: మెగా డీఎస్సీ మెరిట్ జాబితాలు విడుదల
ABN , Publish Date - Aug 23 , 2025 | 06:17 AM
మెగా డీఎస్సీ-2025 అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్...
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన మహిళా అభ్యర్థులు
త్వరలో సర్టిఫికెట్ల పరిశీలనఅనంతరం పాఠశాలల్లోకి
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025 అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), ప్రిన్సిపాల్ పోస్టులకు వేర్వేరుగా జాబితాలు ప్రకటించింది. 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటించగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,12,500(92.9 శాతం) మంది పరీక్షలు రాశారు. పోస్టులు, కేటగిరీల వారీగా పాఠశాల విద్యాశాఖ వారి ర్యాంకులు ప్రకటించింది. వీటి ఆధారంగా ఆయా జిల్లాల్లో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి, ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. మెరిట్ జాబితాల ఆధారంగా ‘ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకునే అభ్యర్థుల’ను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. ఈ పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. జిల్లాల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచిన వారంతా ఉద్యోగాలకు ఎంపికైనట్లు కాదని, పరిశీలన అనంతరం వెల్లడిస్తారని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదిలావుంటే, ప్రిన్సిపాల్ కేటగిరీలో చింతల గౌతమ్ 75.5 మార్కులతో రాష్ట్రంలో టాపర్‌గా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్నెపు శేషాద్రినాయడు(96.4 మార్కులు) ఎస్‌జీటీ టాపరుగా నిలిచాడు.