కలిసే ముంచారు!
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:31 AM
అంపాపురం రియల్ మోసంలో మరో కోణం వెలుగుచూసింది. వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సాంబిరెడ్డి కలిసే ప్లాట్ల కొనుగోలుదారులను ముంచేశారని ఆరోపణలు వస్తున్నాయి. సాంబిరెడ్డి ద్వారా ఫైనాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ నగదు తిరిగి చెల్లించలేక విక్రయించిన ప్లాట్లను ఆయనకే తనఖా పెట్టినట్టు తెలిసింది. వీవీఆర్ పార్టనర్ ఒకరు చనిపోయిన తర్వాత రంగంలోకి దిగిన సాంబిరెడ్డి 6.84 ఎకరాలను తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ర్టేషన్ చేయించేసుకున్నారు. వ్యవసాయేతర భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొంది దర్జాగా పామాయిల్ సాగు చేస్తున్నారు.
- అంపాపురం ‘రియల్’ మోసంలో వెలుగులోకి మరో కోణం
- వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సాంబిరెడ్డి మధ్య రహస్య ఒప్పందం
- సాంబిరెడ్డి ద్వారా ఫైనాన్స్ తీసుకున్న వీవీఆర్ హౌసింగ్
- విక్రయించిన ప్లాట్లను సాంబిరెడ్డికి తనఖా పెట్టిన రియల్ సంస్థ
- వీవీఆర్ పార్టనర్ చనిపోయిన తర్వాత రంగంలోకి దిగిన సాంబిరెడ్డి
- కానుమోలులో 6.84 ఎకరాలకు రిజిస్ర్టేషన్
- 2014లో వ్యవసాయేతర భూమికి పాస్ పుస్తకాలు పొందిన సాంబిరెడ్డి
- వైసీపీ ప్రభుత్వంలో భూమి స్వాధీనం.. పామాయిల్ సాగు
అంపాపురం రియల్ మోసంలో మరో కోణం వెలుగుచూసింది. వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సాంబిరెడ్డి కలిసే ప్లాట్ల కొనుగోలుదారులను ముంచేశారని ఆరోపణలు వస్తున్నాయి. సాంబిరెడ్డి ద్వారా ఫైనాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ నగదు తిరిగి చెల్లించలేక విక్రయించిన ప్లాట్లను ఆయనకే తనఖా పెట్టినట్టు తెలిసింది. వీవీఆర్ పార్టనర్ ఒకరు చనిపోయిన తర్వాత రంగంలోకి దిగిన సాంబిరెడ్డి 6.84 ఎకరాలను తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ర్టేషన్ చేయించేసుకున్నారు. వ్యవసాయేతర భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొంది దర్జాగా పామాయిల్ సాగు చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, హనుమాన్‌జంక్షన్ రూరల్):
ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్లాట్ల కొనుగోలుదారులను నిలువునా ముంచిన అంపాపురంలోని రియల్ ఎస్టేట్ సంస్థ వీవీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రస్తుతం వెంచర్ స్థలం తమ స్వాధీనంలో ఉందని చెప్పుకుంటున్న సాంబిరెడ్డి మధ్య రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చింది. వీవీఆర్ హౌసింగ్ ప్రాజెక్టుకు ప్రైవేటు వ్యక్తి సాంబిరెడ్డి ఫైనాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సంస్థ ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవటంతో కొనుగోలుదారులకు విక్రయించిన ప్లాట్లను ఆ వ్యక్తికి తనఖా పెట్టినట్టు సమాచారం. దీనిని అడ్డుపెట్టుకుని సాంబిరెడ్డి వ్యవసాయేుతర భూమిని తన పేరుతో వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు. రెవెన్యూ శాఖ నుంచి పాస్‌పుస్తకాలను కూడా పొందారు. ఏకంగా రిజిస్ర్టేషన్ కూడా చేయించేసుకున్నారు.
బాధితుల ఫిర్యాదుతో మరిన్ని విషయాలు వెలుగులోకి..
వీవీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పుగా ఇచ్చిన మొత్తానికి వెంచర్‌ను ప్రైవేటు వ్యక్తులు తనఖా పెట్టుకున్నారు. వెంచర్ అంటే .. వ్యవసాయేతర భూమి. గతంలో వ్యవసాయభూమిగా ఉన్నప్పటికీ వెంచర్ కోసం ల్యాండ్ కన్వర్షన్ జరిగింది. వ్యవసాయేతర భూమిగా ఉన్న దానిని ప్రైవేటు వ్యక్తులు తమ పేరుతో రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డులలోకి ఎక్కించుకోవటంతో పాటు ఏకంగా పాస్ పుస్తకాలను కూడా పొందారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని ఆయిల్‌పామ్ సాగు చేశారు. వెంచర్‌లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటన్నది వీవీఆర్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ యాజమాన్యం కనీసంగా కూడా ఆలోచించలేదు. వందలాది మందికి ప్లాట్లను విక్రయించి వారి దగ్గర కోట్ల రూపాయలను వసూలు చేసిన వీవీఆర్ సంస్థ ఈ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎలా బదిలీ చేసిందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
2010లో ల్యాండ్ కన్వర్షన్
అంపాపురం గ్రామంలోని సర్వే నెం. 201-1, 203-1, 210-2, 213-2లో వీవీఆర్ సంస్థ కొనుగోలు చేసిన సుమారు 44 ఎకరాల భూమిలో 33 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు 2010లో గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసుకుంది. గ్రామపంచాయతీకి రూ.1,29,472లను కట్టిన రసీదు నెం.12421 ద్వారా తదనంతరం ఆర్డీవో ద్వారా వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నారు. ఇలా వ్యవసాయేతర భూమిగా నమోదైన భూమిలో 6.84 ఎకరాలను 2011, జూలై నెలలో భీమవరపు సాంబిరెడ్డి వ్యవసాయభూమిగా రిజిసే్ట్రషన్ చేయించుకున్నాడు. కానుమోలు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ జరిగింది. వీవీఆర్ హౌసింగ్‌కు చెందిన పార్టనర్ కేఎస్ మూర్తి ద్వారా కంపెనీలో పెట్టుబడి పెట్టి ఈ భూమిని సాంబిరెడ్డి రాయించుకున్నట్టు తెలుస్తోంది. తదనంతరం కేఎస్ మూర్తి హఠాన్మరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని వ్యవసాయేతర భూమి అయినా రిజిస్ర్టేషన్ శాఖ అధికారులకు డబ్బులు చెల్లించి, భూమి పత్రాలు ఇవ్వకుండానే తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిసే్ట్రషన్ చేయించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. 2014లో అప్పటి తహసీల్దార్ నరసింహారావు, రెవెన్యూశాఖ అధికారులు ఇతనికి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా మంజూరు చేశారని బాధితులు చెబుతున్నారు. అప్పట్లోనే తన కుటుంబసభ్యుల పేరుతో రిజిసే్ట్రషన్ చేసేందుకు ప్రయత్నించగా, 6.84 ఎకరాల వ్యవసాయ భూమి కాస్తా 16,505 గజాలుగా నమోదైంది. ఇంత సొమ్ము ఎక్కడిదంటూ ఆదాయపన్నుశాఖ నుంచి తాఖీదులందుకున్న సాంబిరెడ్డి తనకున్న పలుకుబడిని ఉపయోగించి తప్పించుకున్నాడని తెలిసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకుని, పామాయిల్ సాగు చేసినట్టు బాధితుడు రఘువీర్‌శర్మ వివరించారు.
పాస్ పుస్తకాలు రద్దుకు సిఫార్సు
గుగూల్ మ్యాప్ ఆఽధారంగా బాధితుడు రఘువీర్‌శర్మ గత 20 సంవత్సరాలుగా తీసిన ఆధారాలతో వ్యవసాయేతర భూమిగా నమోదైన భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని రెవెన్యూ అధికారుల ముందు నిరూపించారు. దీంతో రెవెన్యూశాఖ అధికారులు కూడా పరిశీలన జరిపి, తప్పు జరిగిందని ధ్రువీకరించారు. పట్టాదారు పాసు పుస్తకాల రద్దుకు సిఫార్సు చేశారు.
పీజీఆర్‌ఎస్, ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం), ఆంధ్రజ్యోతి మద్దతుతోనే పోరాటం చేస్తున్నామని బాధితులు తెలిపారు. తమ పోరాటానికి అండగా నిలిచిన పీజీఆర్‌ఎస్, ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు చెప్పారు. తమ భూమి తమకు అప్పగిస్తే చాలని కోరారు.