Police Investigation: నెల్లూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:59 AM
నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల వసతిగృహంలో వైద్యవిద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కళాశాల వసతిగృహంలో ఘటన
నెల్లూరు(క్రైం), నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల వసతిగృహంలో వైద్యవిద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగోట్ల గ్రామానికి చెందిన ఆర్. నాగమహేశ్వర్(21) నెల్లూరు ఏసీఎ్‌సఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నాడు. అతనితోపాటు అదే గదిలో ముగ్గురు విద్యార్ధులు ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతను గదిలో ఉండగా సహచర విద్యార్థులు ముగ్గురు బయటకు వెళ్లారు. సాయంత్రం ఇద్దరు గదికి వచ్చి తలుపులు తట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. దీంతో అక్కడున్న వారితో కలిసి తలుపులు బలవంతంగా తెరిచారు. గదిలో నాగమహేశ్వర్ ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని వేలాడుతూ ఉన్నాడు. విద్యార్ధులు కళాశాల వైస్ ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. ఆయన దర్గామిట్ట పోలీసులకు తెలియజేయడంతో ఇన్‌స్పెక్టర్ బీ. కళ్యాణరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఎవరితో మాట్లాడే వాడు కాదని, ఇటీవల ఆరోగ్య సమస్యలతో వైద్యశాలలో చూపించుకొని చికిత్స పొందుతున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.