AP Medical Colleges: వైద్యం పై విషం
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:56 AM
ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదని, ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుందని నాడు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినా జగన్ వినలేదు. హడావుడిగా శంకుస్థాపనలు చేసేసి, మీ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు...
పీపీపీలో మెడికల్ కాలేజీలు.. వైసీపీ ఏడ్పులు
వైఫల్యాలు దాచి కూటమిపై జగన్ అభాండాలు
నాడు ఆర్భాటంగా 17 కాలేజీలకు శంకుస్థాపన
నిర్మాణ అంచనా వ్యయం రూ.8,480 కోట్లు
నాలుగేళ్లలో చేసింది 2125 కోట్ల పనులే
ఈ నిధులన్నీ అప్పులు, కేంద్రం సాయమే
పైగా 674 కోట్ల బిల్లులు పెండింగ్
హడావుడిగా 5 కాలేజీలు ప్రారంభం
అరకొర వసతులు, ఫ్యాకల్టీతోనే క్లాసులు
మరో 10 కాలేజీల పూర్తికి 6 వేల కోట్లు కావాలి
వాటిని పీపీపీతో నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం
వాస్తవాలు దాచి జగన్ విష ప్రచారం
నాడు జగన్ ఉత్తుత్తి ఆర్భాటం
గత జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని 2020లో ఆర్భాటంగా ప్రకటించింది. 2023 డిసెంబరు చివరి నాటికే నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు తరగతులు కూడా ప్రారంభిస్తామని గొప్పలు చెప్పింది. నిర్మాణ అంచనా వ్యయం రూ.8,480 కోట్లు. కానీ జగన్ హయాంలో నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నాబార్డు, కేంద్ర ప్రభుత్వ నిధులు, సహకారంతో పనులు ప్రారంభించారు. నాలుగేళ్లలో నాలుగో వంతు పనులు కూడా చేయలేదు. పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణం, ఫ్యాకల్టీ నియామకం చేపట్టకుండానే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు.
నేడు కూటమి దిద్దుబాటు
ఎన్నికల తర్వాత పాడేరు మెడికల్ కాలేజీ ప్రారంభించారు. కేంద్రం నిధులతో ఓ కాలేజీ నిర్మించనున్నారు. అసంపూర్తిగా ఉన్న మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి, రెండు చోట్ల కనీసం ఇటుక కూడా వేయని దుస్థితి. పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలంటే ప్రస్తుతం రూ.6 వేల కోట్లకు పైగా వెచ్చించాలి. సిబ్బంది జీతాలు, కాలేజీల నిర్వహణకు ఏటా రూ.1500 కోట్లు అవసరం. ఇక జగన్ దిగిపోతూ కాంట్రాక్టు సంస్థలకు రూ.674 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని పూర్తి చేయడం పెను భారం.. వదిలేస్తే అప్పటికే చేసిన ఖర్చు వృథా! అందుకే.. 10 కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదని, ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుందని నాడు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినా జగన్ వినలేదు. హడావుడిగా శంకుస్థాపనలు చేసేసి, మీ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు వస్తున్నాయని ప్రజల్లో ఆశలు రేకెత్తించారు. ఆర్భాటం అయితే చేశారు కానీ తన హయాంలో పూర్తి స్థాయిలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదు. తగిన వసతులు, అవసరమైన ఫ్యాకల్టీ లేకుండానే 5 కాలేజీలను ప్రారంభించారు. మిగిలిన కాలేజీలను అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు వేల కోట్లు ఖర్చు చేసి వాటిని పూర్తి చేయలేరు. అలాగని... ఇప్పటికే ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని వృథా చేయలేరు. అందుకే... ఆ పది కాలేజీలను ీపీఈపీ పద్ధతిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ... దీనిపై జగన్ తనదైన శైలిలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. తాను 17 మెడికల్ కాలేజీలు కట్టేసినట్లు కలరింగ్ ఇస్తూ... వాటిని ప్రభుత్వ పెద్దల బినామీలకు ప్రైవేటుకు ఇస్తున్నారంటూ అభాండాలు వేస్తున్నారు.
కర్త, కర్మ జగనే
‘మెడికల్ కాలేజీల నిర్మాణాలకు డబ్బులు విషయం మీకెందుకు అన్న. ప్రభుత్వాన్ని నడుపుతోంది నేను. డబ్బు అదే వస్తుంది’ అంటూ జగన్ 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు రూ.8,500 కోట్లు కావాలి. ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అడ్డగోలుగా అప్పులు చేసిన జగన్ మెడికల్ కాలేజీల విషయంలోనూ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి బ్యాంకులు రుణాలు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. కాలేజీల కోసం తీసుకున్న వందల ఎకరాల భూములు తనఖా పెట్టడానికి కూడా గత ప్రభుత్వం సిద్ధపడింది. చివరికి నాబార్డు ద్వారా రూ.3672కోట్ల అప్పు మంజూరైంది. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కాలేజీల నిర్మాణానికి కేంద్రం 975 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రత్యేక సహకారం, ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుంచి రూ.302 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. అంటే.. మొత్తం అప్పులు, కేంద్రం నిధులే. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదు. రుణాలు తీసుకున్నా, కేంద్రం సాయం చేసినా కూడా జగన్ ప్రభుత్వం కాలేజీలను పూర్తి చేయలేకపోయింది.
అప్పులు, కేంద్రం నిధులతోనే...
కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో 1100 కోట్లతో ఎయిమ్స్‌ను కేవలం 17నెలల్లో నిర్మించింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క కాలేజీని కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయింది.
రూ.2125 కోట్ల విలువైన పనులు మాత్రమే గత ప్రభుత్వం చేయగలిగింది. అందులోనూ రూ.1451 కోట్లు మాత్రమే కాంట్రాక్ట్ సంస్థలకు బిల్లులు ఇచ్చింది. మరో రూ.674 కోట్లు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంది. నాలుగేళ్లల్లో 25 శాతం పనులు చేసి, 16 శాతం బిల్లులే చెల్లించారు.
పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించిన టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు.
గత ప్రభుత్వంలోనే కాలేజీల నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఫేజ్-2 మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు లభించలేదు.
ఇదీ కూటమి సర్కారు నిర్ణయం
తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలలపై ఒప్పందాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెనుకొండ, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కళాశాలల పనులను రెండో దశలో అభివృద్ది చేయాలని క్యాబినెట్ తీర్మానించింది. వీటిని పీపీపీ విధానంలో పూర్తి చేస్తారు. 2027-28 విద్యా సంవత్సరం నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
420 పడకలతో ఆసుపత్రులను నిర్వహించడంతోపాటు వాటిని నేషనల్ మెడికల్ కమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనుంది. కొత్త మెడికల్ కళాశాలల్లో 150 వరకు ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి.
2023--24 మధ్య గత ప్రభుత్వం అరకొర వసతులతో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను ప్రారంభించింది. అక్కడ పూర్తిస్థాయిలో సేవలందించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే
‘‘ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ విషం చిమ్మడం మొదలుపెట్టింది. ‘రూ.8,500కోట్ల విలువైన కాలేజీలను రూ.5,000కోట్లకే బినామీలకు లీజులకు ఇస్తున్నారు’ అంటూ గగ్గోలు పెడుతోంది. అసలు నిర్మించని కాలేజీలను ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుంది? పీపీపీ విధానంతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందనేది అవాస్తవం. కళాశాలలపై నియంత్రణ, యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే. ఫీజులపై నియంత్రణ ప్రభుత్వం చేతిలోనే ఉంటుం ది. ఓపీ సేవలు ఉచితంగానే అందుబాటులోకి వస్తాయి’’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.