Share News

మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదు

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:36 AM

ప్రభుత్వ వైద్యకళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడంలేదని, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు.

   మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదు
మెడికల్‌ కాలేజీలో మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఫరూక్‌

వైసీపీ తప్పుడు ప్రచారం

మౌలిక సదుపాయాల మెరుగునకు కృషి

రూ.4,500కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధికి శ్రీకారం

రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యకళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడంలేదని, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు. మంగళవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలు, వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన వినాశనం నుంచి రాషా్ట్రన్ని కాపాడటానికి కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. మెడికల్‌ కళాశాలలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మెడికల్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు, మరిన్ని వైద్య సీట్లను కల్పించడానికి పీపీపీ విధానాన్ని అవలంభిస్తోందన్నారు. వైద్యసేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అసంపూర్తి పనులను వేగంగా పూర్తిచేస్తూ పీపీపీ విధానం ద్వారా పదికొత్త మెడికల్‌ కాలేజీలను స్థాపిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పూర్తిచేయకుండా వదిలేసిన మెడికల్‌ కాలేజీలను ఫేస్‌-1కింద మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను త్వరగా పూర్తిచేస్తామన్నారు. 2027-28లోగా పూర్తిచేయడంతో ఒక్కో కాలేజీలో 150మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కాలేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ, యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం వద్దనే ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యశాఖలో 3వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుందన్నారు. రూ.4,500కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఫరూక్‌ వెల్లడించారు.

Updated Date - Sep 10 , 2025 | 12:36 AM